విజయశాంతి రీ ఎంట్రీ చిత్రం మొదలు!?
దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను తన నటనతో,అందచందాలతో ఆకట్టుకుని వెలిగిన విజయశాంతి గత కొంత కాలంగా సినిమాకు దూరమయ్యారు. అయితే తాజాగా ఆమె మళ్ళీ 'రాణి రుద్రమ' అనే చిత్రంలో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అత్యంత భారీగా ఈ చారిత్రిక చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆమే నిర్మాతగా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ సబ్జెక్టు నిమిత్తం ఆమె రీసెర్చ్ పని కూడా ప్రారంభించిందని అంటున్నారు. ఇక భారత చలన చిత్ర చరిత్రలోనే ఒక అద్భుత దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని మలచాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ కథ, కథనం ఓటమి ఎరుగని మహా సామ్రాజ్ఞిగా 'రాణి రుద్రమ' కాకతీయ సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించి,ప్రజల మన్ననలు పొందిందనే దిశలో నడుస్తుంది. రామ్ చరణ్ తేజ హీరోగా చేసిన మగధీర ఘన విజయం కూడా విజయశాంతి ఈ తరహా చిత్రం ప్లాన్ చేయటానికి ప్రేరణ కలిగించి ఉండవచ్చునని అంటున్నారు. మరో ప్రక్క బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్రను సుస్మితాసేన్ రూపొందించే పనిలో ఉంది.
రుద్రమదేవి తెలంగాణ ప్రాతం ఓరుగల్లును పాలించింది. అందుకే తెలంగాణకి సపోర్టు చేసినట్లు ఉంటుంది...తిరిగి తనకు క్రేజ్ వచ్చినట్లు ఉంటుందని ఆమె ఈ ప్రయత్నం ప్రారంభించినట్లు వినపడుతోంది. ఇక విజయశాంతి నటించగా విడుదలైన చివరి తెలుగు సినిమా అడవి చుక్క. అలాగే ఆమె దాసరి దర్శకత్వంలో రైఫిల్స్ అనే చిత్రం ప్రారంభమై ఆగిపోయింది. ఆమె,అమితాబ్ నటించిన జమానత్ అనే హిందీ చిత్రం 2009లో రిలీజైంది.


Click it and Unblock the Notifications











