ఆ క్రేజ్ క్యాచ్ చేసుకున్న లేడీ అమితాబ్.. రష్మిక సంగతేమో గానీ విజయశాంతికి మాత్రం!
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది రష్మిక మందన్న. చేసింది కొన్ని సినిమాలే అయినా కోటికి పైగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటోందని తెలుస్తోంది. మరోవైపు సీనియర్ హీరోయిన్ విజయశాంతి రష్మికను మించి రెమ్మ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి రెమ్మ్యూనరేషన్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

విజయశాంతితో రష్మిక..
విజయశాంతి, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమాలో ఈ ఇద్దరికీ ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో బయటపడింది. ఈ నేపథ్యంలో విజయశాంతి, రష్మిక ఇద్దరి రెమ్మ్యూనరేషన్ పై ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

13 ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్.. ఆయనకే సాధ్యం
లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు తెరపై అడుగుపెడుతోంది. ఆమె కోసమే ప్రత్యేకంగా ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ రాసుకున్న అనిల్ రావిపూడి పట్టుబట్టి మరీ ఆమెను 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటింపజేశారు. విజయశాంతిని సినిమాల్లోకి తీసుకురావాలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నించినా చివరకు అది అనిల్ రావిపూడి సాధ్యమైంది.

డిమాండ్ చేసిన విజయశాంతి.. చివరకు
అయితే ఈ సినిమాలో నటించేందుకు గాను విజయశాంతి బాగానే డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఏకంగా ఆమె 2.5 కోట్లు అడిగిందని, కానీ చివరికి 1.5 కోట్లకు బేరం తెగ్గొట్టారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు హీరోయిన్ రష్మిక మందన్నకు కోటి రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. అంటే ఇక్కడ హీరోయిన్ కంటే కూడా విజయశాంతికే డిమాండ్ ఎక్కువ ఉండటం విశేషం.

సీనియర్ హీరోయిన్ల క్రేజ్.. క్యాచ్ చేసుకున్న విజయశాంతి
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లకు ఎక్కువ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్స్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ కోటికి పైగానే తీసుకుంటున్నారు. దీంతో ఇక ఇప్పుడు విజయశాంతి కూడా ఇదే దారిలో వెళ్తుందని, ఇకపై సినిమాలు చేసి భారీ పారితోషికం అందుకుంటుందని టాక్ నడుస్తోంది.

మహేష్ నిర్మాణంలో సరిలేరు నీకెవ్వరు
ఇక సరిలేరు నీకెవ్వరు నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగమవ్వడం విశేషం. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ జనవరి 11న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











