‘వాల్మీకి’లో పూజా హెగ్డేను కావాలనే పెట్టారు.. అక్కడ లేనిది ఇక్కడెందుకు..?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తన తోటి హీరోలకు భిన్నంగా వ్యవహరిస్తూ కొత్త కొత్త ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నాడు. వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడతను. వరుణ్ చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో వరుణ్ లుక్ ఆకట్టుకుంది. దీనికి మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో ఈ సినిమాపై కొందరికి అనుమానం వ్యక్తం అవుతోంది. అదే.. ఇందులో పూజా హెగ్డే పాత్ర గురించి. 'జిగర్తాండ'లో హీరోకు జోడీగా ఎవరూ నటించలేదు. కానీ, ఇందులో మాత్రం పూజా హెగ్డేను పెడుతున్నారా అన్నదే అందరికీ కలుగుతున్న అనుమానం.
ఒరిజినల్‌లో బాబీ సింహా పోషించిన పాత్రనే వరుణ్ చేస్తున్నాడు. అలాగే సిద్ధార్ధ్ పాత్రలో ఆధర్వ కనిపించనున్నాడు. అతడికి గర్ల్‌ఫ్రెండ్‌గా మృణాళిని నటిస్తోంది. మరి, పూజా హెగ్డే ఏ పాత్రను చేస్తుంది. అంటే.. ఆమెను వరుణ్‌కు జోడీగా చూపించబోతున్నారని తెలిసింది. దీంతో అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు ప్రయోగిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











