ఐపీఎల్ టీంపై కన్నేసిన మరో స్టార్ హీరో...?
ముంబై: మన దేశంలో బాగా పాపులర్ అయిన పొట్టి క్రికెట్ ఫార్మాట్ టోర్నీ 'ఇండియన్ ప్రీమియర్ లీగ్'(ఐపీఎల్)లో షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా, శిల్పా శెట్టి లాంటి వారు సొంతగా టీంలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ టీంలు కొనుగోలు చేయడం వల్ల వారు లాభ పడ్డారా? నష్టపోయారా? అనే సంగతి తక్కన పెడితే....ఫ్రాంచైజీ ఓనర్లుగా వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన లిటిల్ హార్ట్స్ మారథాన్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్, నెస్ వాడియతో ఐపీఎల్ గురించి చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ప్రీతీ జింతా, నెస్ వాడియాలు కలిసి ఐపీఎల్ కింగ్స్ లెవన్ పంజాబ్ టీంను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ టీం కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది? లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలపై సల్మాన్ ఖాన్ చర్చించినట్లు తెలుస్తోంది.
భారత్‌లో సినిమాలకు, క్రికెట్‌కు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో.....సల్మాన్ లాంటి స్టార్ హీరో ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం వల్ల పలు కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరించడానికి క్యూ కడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి సల్మాన్ ఖాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications












