'ఈగ' దెబ్బకు 'జులాయి'వెనక్కి?
అల్లు అర్జున్ తాజా చిత్రం'జులాయి'మరింత వెనక్కి వెళ్ళిపోతోంది. జూలై 13న విడుదల చేయాలనుకుంటున్న ఈ చిత్రం జూలై 20కి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈగ కలక్షన్స్ ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. అయితే అఫీషియల్ గా ప్రకటన రాలేదు. గతంలోనూ ఈగ కోసం జులాయిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. అందులోనూ జూలై 13న డేవిడ్ భిళ్లా కూడా విడుదల అవుతోంది. దాంతో ఆ సినిమానూ గట్టి పోటీ ఇచ్చేటట్లు ఉంది. ఇదంతా గమనించిన నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రం పాటలు ఇప్పటికే రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ...''త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం ఓ అందమైన అనుభవం. అలాగే మళ్లీ నా సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వడం, ఇలియానాతో తొలిసారి నటించడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారితో తొలిసారి నటిస్తున్నాను. ఆయన డైలాగ్ టైమింగ్ సూపర్బ్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో డైలాగ్స్‌కి విజిల్స్ పడతాయి'' అని అన్నారు.
'జులాయి' స్టోరీలైన్ విషయానికి వస్తే...పని, పాట లేకుండా తిరిగేవాడ్ని పెద్దలు 'జులాయి' అంటుంటారు. ఆ పెద్దలే... మగాడు తిరక్క చెడతాడు... ఆడది తిరిగి చెడుతుంది అని సూక్తులు వల్లిస్తుంటారు. వీటిల్లో ఏది కరెక్ట్? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలాకష్టం. అందుకే ఆ పెద్దల తిట్లను కూడా ఆశీర్వాదాలుగా తీసుకుంటుంటాడు ఓ కుర్రాడు. వాళ్లు 'వెధవ' అన్నా... 'వెయ్యేళ్లు ధనముతో వర్థిల్లు' అని దీవించినంత ఆనందపడిపోతాడు. అలాంటి కుర్రాడికి ఓ కుర్రది తారసపడితే... ఇక ఆ సందడికి హద్దు ఉంటుందా... అల్లు అర్జున్ 'జులాయి' సినిమా నడక ఇలాగే ఉంటుంది .
నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్ శైలిలోనే సరదాగా సాగిపోయే చిత్రమిది. యాక్షన్ అంశాలకూ ప్రాధాన్యం ఉంది. జులాయిగా తిరిగే ఓ అబ్బాయి... తన లక్ష్యం ఎలా ఏర్పరచుకొన్నాడు? అందుకోసం ఏం చేశాడో తెరమీదే చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి''అన్నారు. సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.


Click it and Unblock the Notifications











