Allu Arjun ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్.. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో తెలుసా?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖుల ప్రభావం ఎక్కువగానే కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ సినీ ప్రముఖులను ప్రచారంలోకి దించుతున్నది. దాంతో ఈ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో సినీ నటులు ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అయితే తాజాగా దగ్గుబాటి వెంకటేష్ కుటుంబం ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థికి భారీగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే అల్లు అర్జున్ కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారనే ఓ వార్త మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అగ్ర సినీ నటులు అండ స్పష్టంగా కనిపిస్తున్నది. విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రాఘురాంరెడ్డి ఖమ్మం పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో వారి కుటుంబం ప్రచారంలో నిమగ్నమైంది. ఖమ్మంలో వెంకటేష్ కూతురు, రాఘురాంరెడ్డి కోడలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.

ఇక ఎన్నికల నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తారనే వార్త ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇందుకు కారణం.. ఐకాన్ స్టార్ సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలిసిందే. అయితే నల్లగొండ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి బంధువులు కావడంతో చంద్రశేఖర్ రెడ్డి చొరవ తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది.
ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి.. తనకు అత్యంత సన్నిహితులైన జానా రెడ్డి ఫ్యామిలీకి సపోర్టుగా నిలిచారు. రఘువీర్ రెడ్డి విజయానికి ఆయన తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ పార్లమెంట్ స్థానంలో అల్లు అర్జున్‌ను ప్రచారం చేయాలని కోరినట్టు సమాచారం. రఘువీర్ కూడా ఐకాన్ స్టార్‌ను రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. అయితే తెలంగాణలో ప్రచారం చేస్తే.. ఆంధ్రాలో పవన్ కల్యాణ్‌కు కూడా క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. అందుచేత అల్లు అర్జున్ ప్రచారానికి వస్తాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ప్రచారానికి వెళ్తారా? లేదా అనేది సందేహంగానే ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ వస్తే కాంగ్రెస్ విజయవకాశాలు మరింత పెరుగుతాయనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఈ వ్యవహారాన్ని తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితిగానే చూడాల్సి వస్తుందని సినీ, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











