అల్లు ఫ్యామిలీకి మరో స్ట్రోక్.. బెట్టింగ్ యాప్ స్కాంలో అల్లు అరవింద్ కంపెనీ?
పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ సంథ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అల్లు అర్జున్ ఇంట్లో బలప్రదర్శన, బన్నీ ప్రెస్ మీట్ తదితర పరిణామాలు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. అల్లు ఫ్యామిలీ , అల్లు అర్జున్ తీరు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందని ఫిలింనగర్‌లో ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. అయితే నెమ్మదిగా ఇరువర్గాలకు రాజీ కుదరి వ్యవహారం సద్దుమణిగింది. కానీ మరోసారి అల్లు ఫ్యామిలీని తెలంగాణ పోలీసులు టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ తెలుగు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బెట్టింగ్ యాప్‌ల బెండ్ తీస్తున్నారు తెలంగాణ పోలీసులు. అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే స్టార్ యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ.. జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించి పలు వివరాలను రాబట్టారు. ఈ లిస్ట్‌లో మరికొందరి పేర్లు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు యాంకర్ శ్యామల పేరు కూడా ఈ కేసులో తెరపైకి వచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో శ్యామల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు స్వల్ప ఊరట లభించింది. శ్యామలను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదట విచారణకు హాజరు కావాలని శ్యామలకు సూచించింది. అలాగే నోటీసు ఇచ్చి దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు సూచించింది హైకోర్ట్.
ఇకపోతే.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబం కూడా బెట్టింగ్ యాప్ వ్యవహారంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అరవింద్ యాజమాన్యంలోని ఆహా ఓటీటీ ఇందుకు కారణమైంది. ఆహా సక్సెస్‌కు, సబ్‌స్క్రిప్షన్ల పెరుగుదలకు కారణమైన అన్‌స్టాపబుల్ టాక్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఎందరో స్టార్స్ తమ మనోగతాలను ఆవిష్కరించారు. నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మరో సీజన్ కోసం రెడీ అవుతోంది.
ఈ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షోలో భాగంగా ప్రభాస్ - గోపీచంద్ గెస్టులుగా వచ్చిన ఎపిసోడ్‌లో ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారని .. దీని కారణంగా తాను రూ.80 లక్షల మేర నష్టపోయానని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాపోతున్నాడు. దీంతో అల్లు అరవింద్ ఫ్యామిలీ మరోసారి చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహా ఓటీటీ .. గీతా ఆర్ట్స్, మై హోమ్ జాయింట్ వెంచర్. అలాగే ఈ యాప్ పేరు అల్లు అర్జున్ కుమార్తె అర్హా పేరుతో అర్హా మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











