అధికార పార్టీ అండతో మంచు విష్ణు జోరు? హాట్ టాపిక్‌గా హీరో వైఖరి
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు మంచు విష్ణు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'ఢీ' అనే సినిమా మినహా ఆయనకు అంత పెద్దగా పేరు తెచ్చినవి తక్కువే. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం అన్వేషిస్తున్న ఈ మంచు వారి అబ్బాయి.. ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ఇటీవల 'ఓటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది.

వరుసగా నాలుగు ప్రాజెక్టులు
ఈ నేపథ్యంలో మంచు విష్ణు భవిష్యత్ ప్రశ్నార్థకమే అని అంతా భావించారు. కానీ, అతడు మాత్రం ఒకేరోజు నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘‘ఈరోజు నాలుగు ప్రాజెక్టులను మొదలుపెట్టాను. అందులో రెండు నేను నటించేవి కాగా, మరొకటి వెబ్ సిరీస్, అలాగే ఇంకొకటి ఫీచర్ ఫిల్మ్. నాకు లక్ కలిసి రావాలని కోరుకుంటున్నాను. రెండు సంవత్సరాలు చేతి నిండా పనే'' అంటూ రాసుకొచ్చాడు.

వైసీపీ నేతల సాయం
ఇక్కడ అసలు కథ మొదలైంది. కెరీర్ అంతా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విష్ణు.. ఒకేసారి నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించడం పట్ల కొందరు తమకు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. విష్ణుకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ఆర్థిక సహాయం చేస్తున్నారని, అందుకే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనూ ఆయన సినిమాలు మొదలుపెట్టాడని అంటున్నారు.

చర్చనీయాంశంగా విష్ణు తీరు
దీంతో ఇది కాస్తా చర్చనీయాంశం అవుతోంది. విష్ణు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా నిర్వహించారు. అందుకే ఆ పార్టీ నేతలు విష్ణుకు సాయం చేశారన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ఉన్న బంధుత్వం మేరకు మంచు ఫ్యామిలీ వైసీపీలో చేరిందన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

విష్ణు సన్నిహితుల ఖండన
అయితే, మంచు విష్ణు సన్నిహితులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఒకరి దగ్గరు డబ్బులు ఆశించే తత్వం ఆయనది కాదని అంటున్నారు. సినిమాలు హిట్ కాకపోయినంత మాత్రాన వాళ్ల దగ్గర డబ్బులు లేవనుకోవడం పొరపాటేనని చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ అంశం అటు ఏపీ పాలిటిక్స్‌తో పాటు ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











