మీరే నా ఎనర్జీ.. మీ ఆరోగ్యం నా బాధ్యత.. ‘బర్త్ డే’పై హీరో రామ్ ఎమోషనల్ పోస్ట్
కరోనా కారణంగా దేశంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. పెళ్లిళ్లు, వేడుకలకు దూరమై ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కరోనావైరస్‌ను తరిమి కొట్టడానికి ఇంట్లోనే ఉండి యుద్దం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ఇంట్లోనే ఉంటూ దేశ సేవలో నిమగ్నమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులను ఇబ్బంది పెట్టకూడదని ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని నిర్ణయం తీసుకొన్నారు. తన జన్మదినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని, అలాగే ఈ ఏడాది బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని అభిమానులను కోరారు.
ఈ సందర్భంగా రామ్ పోతినేని ఓ ప్రకటన విడుదల చేస్తూ.. మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టిన రోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో.. అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను అంటూ రామ్ పోతినేని ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం చోటుచేసుకొన్న పరిస్థితుల రీత్యా.. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరు నా సంతోషం, నా ఎనర్జీ, నా ప్రాణం, అంతకు మించి నా బాధ్యత అంటూ అభిమానులను ఉద్దేశించి రామ్ అన్నారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల రీత్యా ఈసారి నా పుట్టిన రోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరమం అందరికీ శ్రేయస్కరం. ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే నాకు ఇచ్చే అసలైన పుట్టిన రోజు కానుకగా భావిస్తున్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించే మీ రాపో అంటూ భావోద్వేగపూరితమైన ప్రకటనను ముగించారు.


Click it and Unblock the Notifications











