మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్.. కన్నీటి వీడ్కోలుకు మృతుడి కుటుంబానికి అండగా..
డబ్బులు అందరూ సంపాదిస్తారు.. కానీ దానిని సమాజం కోసం ఖర్చు పెట్టేవారు చాలా తక్కువ. చాలామందికి తన తర్వాతి తరాలు కూర్చొని తినేంత సంపాదించాలనే తత్వమే. నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే సాటివారికి సాయం చేయాలనే మంచి మనసు ఉంటుంది. ఈ కోవకే చెందుతారు సోనూసూద్. సినిమాల్లో విలన్‌గా ఎంతో మందిని భయపెట్టిన ఆయనది హీరోలని మించి మంచి మనసు. భారతదేశాన్ని కరోనా వణికించిన సమయంలో సోనూసూద్‌లోని మానవతావాది బయటికొచ్చారు. అప్పటికే మూడోకంటికి తెలియకుండా ఎంతోమందికి సాయం చేసిన ఆయన కరోనా సమయంలో వలస కార్మికులు, పేదలు పడుతున్న బాధలకు చలించిపోయారు.
వలస కార్మికులను తన సొంత ఖర్చుతో బస్సులు, కార్లు, విమానాల ద్వారా స్వగ్రామాలకు పంపారు. అంతేకాకుండా చావుబతుకుల మధ్య ఉన్న వారికి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, మందులు ఇలా ఏది కావాలంటే అది అందించే ఏర్పాట్లు చేశారు సోనూసూద్. సోషల్ మీడియాలో తనను అడగటం ఆలస్యం.. ఆగమేఘాల మీద ఆయన రియాక్ట్ అయ్యేవారు. దీంతో సోనూసూద్‌పై దేశప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను విలన్‌గా చూసిన జనం హీరోగా ఆరాధించడం మొదలుపెట్టారు. అనేక ప్రాంతాల్లో సోనూసూద్‌కు అభిమాన సంఘాలు సైతం ఏర్పడ్డాయి. కొందరైతే ఏకంగా ఆయనకు గుడికట్టి పూజలు కూడా చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా తన సేవలను కంటిన్యూ చేస్తున్నారు సోనూసూద్. ఆకలితో అటమటిస్తున్న వారికి ఆహారం, అరుదైన వ్యాధులతో బాధపడేవారికి చికిత్స, నిరుపేద విద్యార్ధులకు ఆర్ధిక సాయం .. ఇలా ఒకటేమిటి చేతికి ఎముకే లేదన్నట్లుగా అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు సోనూసూద్. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్ధితుల నేపపథ్యంలో అక్కడి హిందువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దాడికి గురవుతున్న హిందువులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తానని సోనూసూద్ తెలిపారు.
తాజాగా తన మంచిమనసును ఆయన మరోసారి చాటుకున్నారు. ఇంటి పెద్ద దేశం కానీ దేశంలో మరణించగా.. చివరిచూపు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కుటుంబానికి అండగా నిలిచారు. సౌదీలోని ఓ సిమెంట్ ఫ్లాంట్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. అయితే అక్కడి చట్టపరమైన లాంఛనాలు, మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన ఖర్చులు భరించే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఈ క్రమంలో మృతుడి మేనల్లుడు తనకు సాయం చేయాల్సిందిగా వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేసి సోనూసూద్‌కి ట్యాగ్ చేశారు.
దీనిపై స్పందించిన సోనూసూద్.. సౌదీ అరేబియాలోని కింగ్ ఫైజల్ జనరల్ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని భారతదేశానికి తరలించారు. ఆ వ్యక్తి ఐడీ కార్డ్‌ను షేర్ చేస్తూ.. మంగళవారం సాయంత్రం 4.35 గంటలకు మృతదేహం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నట్లు సోనూసూద్ తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ప్రక్రియలో తనకు సాయపడిన గిరీశ్ పంత్ అనే వ్యక్తిని కూడా సోనూ ట్యాగ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు సోనూసూద్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అన్నా .. నువ్వు నిజంగా రియల్ హీరో అంటూ నెటిజన్లు సోనూసూద్‌ని ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











