3000 మందితో విక్టరీ వెంకటేష్ సెల్ఫీలు .. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్
సురేష్ ప్రొడక్షన్స్ వ్యవస్ధాపకులు, మూవీ మొఘల్‌గా పేరొందిన దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు విక్టరీ వెంకటేష్. చేసిని అన్ని సినిమాల్లో మెజారిటీ విజయాలను అందుకుని అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా నిలిచారు వెంకటేష్. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు వెంకీ. అంతేకాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు దశాబ్ధాలుగా నాలుగు స్తంభాలుగా నిలిచిన అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు.
నిజానికి వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులను సూపర్‌స్టార్ కృష్ణ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఆయన ఊపిరి సలపనంత బిజీగా ఉండటంతో పాటు కొన్ని కారణాలతో హీరోగా వెంకటేష్‌కు ఛాన్స్ వచ్చింది. కథ, స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో రామానాయుడు వెంటనే.. అమెరికాలో ఉన్న కొడుకుకి ఫోన్ చేసి ఆగమేఘాల మీద భారత్‌కు రప్పించారు . అప్పటికి వెంకటేష్‌కు తెలుగు చదవడం, రాయడం కూడా తెలియదు. అయితే నెల రోజుల తక్కువ గ్యాప్‌లోనే నటనలో శిక్షణ ఇప్పించారు రామానాయుడు.

దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులులో వెంకీ మామ సరసన ఖుష్భూ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకీ ఇక హీరోగా స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. క్యారెక్టర్ ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోవడం వెంకటేష్ స్టైల్. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ .. ఇలా ఏ రోల్ అయినా సరే ఆయనకు కొట్టిన పిండి.
టాలీవుడ్‌లో వెంకటేష్‌కు అజాత శత్రువుగా పేరుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఏ వివాదం కానీ, ఏ మచ్చ కానీ ఆయనకు లేవంటే వెంకీ క్రమశిక్షణను , మంచి మనసును అర్ధం చేసుకోవచ్చు. అందరు హీరోలు, దర్శక నిర్మాతలు, నటీనటులు ఆయనను ఎంతో ఇష్టపడతారు. సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత ఈ జనరేషన్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు వెంకటేష్ . కమల్ హాసన్‌తో ఈనాడు, పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, మహేశ్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, తన మేనల్లుడు నాగచైతన్యతో వెంకీ మామ, రామ్ పోతినేనితో మసాలా, వరుణ్ తేజ్‌తో ఎఫ్2, ఎఫ్ 3 వంటి సినిమాల్లో ఆయన కలిసి నటించారు.
ఈ సంక్రాంతికి మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వెంకటేష్ సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం ' సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇందులో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్బంగా తనను కలవడానికి వచ్చిన దాదాపు 3000 మంది అభిమానులతో వెంకటేష్ ఫోటోలు దిగారు. కొద్దిగంటల పాటు ఓపిగ్గా నిలబడి వారి ముచ్చట తీర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వెంకటేష్ ఓపికకి నెటిజన్లు దండాలు పెట్టేస్తున్నారు


Click it and Unblock the Notifications











