వైరల్ అవుతున్న ఫోటో.... విజయ్ దేవరకొండకు ఏమైంది?
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో విజయ్ కుడి చేతిపై గాయాలైనట్లు కనిపిస్తున్నాయి. దీంతో 'డియర్ కామ్రేడ్' సెట్స్‌లో అతడు గాయపడ్డట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే విజయ్ గాయపడ్డట్లు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. మరో వైపు ట్విట్టర్లో విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాకు సంబంధించిన సరదా పోస్టులు చేస్తూ హ్యాపీగా కనిపించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటో అభిమానులను అయోమయంలో పడేసింది.

'డియర్ కామ్రేడ్' సినిమా విషయానికొస్తే... నూతన దర్శకుడు భరత్ కమ్మ ఒక కొత్త కాన్సెప్టుతో 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది సబ్ టైటిల్. 'గీత గోవిందం', 'టాక్సీవాలా' చిత్రాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న 'డియర్ కామ్రేడ్' చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈచిత్రం ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











