మాజీ సీఎంకే అలా అయితే.. నాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏంటీ? చంద్రబాబు అరెస్ట్‌పై విశాల్
యాంగ్రీ యంగ్ మ్యాన్ విశాల్, టాలెంటెడ్ డైరెక్టర్ యాక్టర్ ఎస్ జే సూర్య, కమెడియన్ హీరో సునీల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం విడుదలై భారీ విజయాన్ని అందుకొంటున్నది. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ అధిక్, విశాల్, ఎస్‌జే సూర్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
టైమ్ మిషన్ నాకు లభిస్తే.. ముందుగా నేను సిల్క్ స్మితతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. ఆమె మరణానికి ముందు డేట్ రోజు కాల్ చేసి అలాంటి నిర్ణయాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తాను. అలాగే భగత్ సింగ్‌ను ఉరి తీయడానికి ముందు రోజు కాల్ చేసి.. ఆయన ఉరి తీయకుండా ఆపేందుకు టైమ్ మిషన్ వాచ్‌ను ఉపయోగిస్తాను అని విశాల్ అన్నారు.

చంద్రబాబు అరెస్ట్ గురించి విశాల్ స్పందిస్తూ.. ఆర్థిక అవకతవకలు ఆరోపణల ఆధారంగా నమోదు చేసిన కేసులో చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. జగన్ నాకు నచ్చిన వ్యక్తి అని మనస్పూర్తిగా చెప్పినప్పటికీ.. నేను ఇక్కడ ఓటు వేయలేదు. తమిళనాడులో నేను ఓటు వేశాను. వ్యక్తిగా నేను ఆలోచించినప్పుడు.. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ముందు ఏపీ ప్రభుత్వం సరిగా ఆలోచించి ఉండాల్సిందనిపిస్తున్నది అని విశాల్ అన్నాడు.

చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. నాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అనే భయం, ప్రశ్న నాలో వచ్చింది. చంద్రబాబు నాయుడు అడిగే ప్రశ్నలకు సమాధానం కనిపించడం లేదు. సామాన్యుడినైనా నాకే క్లారిటీ కనిపించడం లేదు. చిట్టచివరికి న్యాయం సరైన వ్యక్తికి జరుగుతుందని నేను భావిస్తున్నా. నేను సినిమా రంగానికి చెందిన వాడినైనప్పటికీ.. ఇంటికి వెళ్తే సామాన్యులమే అని విశాల్ అన్నాడు.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయనే విషయం గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం ఏదైనా చేసినప్పుడు గానీ, ఎలాంటి నిర్ణయం తీసుకొన్నప్పుడు గానీ సరైన కసరత్తు చేయాల్సి ఉండేదనే ఫీలింగ్ నాకు కలిగింది అని విశాల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ఇక మార్క్ ఆంటోని సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం గత 5 రోజుల్లో 40 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తమిళంలో 36 కోట్లు, తెలుగులో 5 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.


Click it and Unblock the Notifications











