అక్కడ అమ్మాయిని కలిసిన ఇక్కడ అబ్బాయి.. తొలి హీరోయిన్‌ను కలిసిన పవన్ కల్యాణ్.. ఫోటో వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో సామాన్య ప్రజల కంటే సినీ జనాలు హమ్మయ్య అనుకున్నారు. ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను మూడు చెరువుల నీళ్లు తాగించారు. టికెట్ ధరల తగ్గింపు, ప్రభుత్వ వెబ్ పోర్టల్, స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు ఇలా అసాధారణ నిర్ణయాలతో జగన్ టాలీవుడ్‌ని చెడుగుడు ఆడుకున్నారు . అందుకే ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏపీలో రావాలని సినీ ప్రముఖులు కోరుకున్నారు. వారి ఆశలు ఫలించి చిత్ర పరిశ్రమకు అనుకూల వ్యక్తిగా ముద్రపడిన చంద్రబాబు నాయుడు సీఎంగా.. స్వయంగా ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పైగా పవన్ పార్టీకి చెందిన వ్యక్తి చేతుల్లోనే సినిమాటోగ్రఫి శాఖ ఉండటంతో చిత్ర ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగం నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్లిన పవన్ కళ్యాణ్ సక్సెస్‌ను తమ సక్సెస్‌గా భావించి ఆదివారం ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. సినీ, రాజకీయ, మీడియా రంగాలకు చెందిన పలువురు ఈ ఈవెంట్‌కు హాజరై పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తెల్లారే హైదరాబాద్ నుంచి సినీ నిర్మాతల బృందం విజయవాడకు చేరుకుని .. పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఇబ్బందులను వారు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, చిత్రీకరణలకు అనుమతులు వంటి అంశాలను ఆయనకు వివరించారు.

పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. అందరం సరదాగా కాసేపు మాట్లాడుకున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్‌ను కోరామని,త్వరలో పరిశ్రమలోని అన్ని అసోసియేషన్లతో వచ్చి చంద్రబాబును అభినందిస్తామని అల్లు అరవింద్ అన్నారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైనా త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.

పవన్‌ను కలిసిన వారిలో అల్లు అరవింద్, దిల్‌రాజు, సురేష్ బాబు, అశ్వినీదత్, ఎస్ రాధాకృష్ణ, ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, రవిశంకర్, నవీన్ ఎర్నేనీ, నాగవంశీ, భోగవల్లి ప్రసాద్ తదితరులు ఉన్నారు. అయితే అందరిలోకి నాగార్జున మేనకోడలు , నిర్మాత సుప్రియా యార్లగడ్డ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవర్‌స్టార్‌గా, జనసేనానిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మారడానికి కారణమైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో ఆమె హీరోయిన్‌గా నిలిచారు. పవన్ సరసన జోడి కట్టే తొలి ఛాన్స్ ఆమెకే దక్కింది.

సరిగ్గా 28 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్, సుప్రియాలను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ఈవీవీ సత్యనారాయణ చేతుల్లో పెట్టారు చిరంజీవి, నాగార్జున. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబర్ 11న విడుదలై ఘన విజయం సాధించింది. అప్పటికే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమాలో వాటిని ప్రదర్శించి అభిమానులను అలరించారు. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అప్పుడు శిఖరాగ్రాన ఉంది.. ఆ సమయంలో తన తమ్ముడిని పరిచయం చేయడంతో ఫ్యాన్స్ ఎగబాడి సినిమా చేశారు.
ఈ చిత్ర విజయం తర్వాత పవన్ కళ్యాణ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వినూత్న కథలతో యూత్ ఐకాన్‌గా, పవర్‌స్టార్‌గా నిలిచిన ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. అయితే సుప్రియ మాత్రం హీరోయిన్‌గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. తర్వాత చరణ్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్దిరోజుల్లోనే ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత చాలా కాలం పబ్లిక్‌గా దూరంగా ఉన్న సుప్రియ అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు. ఇలాంటి వేళ తన తొలి సినిమా హీరోయిన్ తో పవన్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











