అరవై రోజుల్లో ఆదిపురుష్... అంతే అనేసిన డార్లింగ్...
ఆదిపురుష్ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ చకచకా జరిపోవడం జనాల కళ్లకు కడుతూనే ఉంది. ఓ వైపు స్టార్ క్యాస్టింగ్ ఇంకా జరుగుతూనే ఉన్నా, మరోవైపు షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా యుద్ధప్రాతిపదికన జరుతున్నాయా అనిపిస్తోంది. దర్శకుడు ఓం రౌత్ టీమ్ ను పరుగులు పెట్టిస్తున్న తీరుకు, ఆదిపురుష్ అనుకున్న టైమ్ కన్నా ముందే జనాల ముందుకు వచ్చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.
ఓం రౌత్ స్పీడ్ మీద ఉన్న నమ్మకమో ఏమో, మన డార్లింగ్ ప్రభాస్ కూడా సినిమా కోసం గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే లీడ్ రోల్ కోసం దేహధారుఢ్యాన్ని పెంచుతున్న యంగ్ రెబెల్ స్టార్, మరోవైపు డైలాగ్స్ మాడ్యులేషన్ కూడా ప్రారంభించాడని తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ కోసమూ డేట్లు కేటాయించేశాడట మన డార్లింగ్. అయితే అందరూ అనుకున్నదానికి భిన్నంగా మనోడు కేవలం 60రోజులు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది.

లీడ్ రోల్ కు 60రోజుల డేట్లు ఏం సరిపోతాయన్నదే అందరి డౌట్. కానీ, ఓం రౌత్ మాత్రం చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. యంగ్ రెబెల్ స్టార్ డేట్లను ఎఫెక్టివ్ గా వాడుకోవడం ఎలాగో తెలసిన ఓమ్ రౌత్ 2021 జనవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. త్వరిత గతిన షూటంగ్ పూర్తి చేసి 2022 వేసవి నాటికి సినిమాను విడుదల చేసేయాలన్నది రౌత్ ఆలోచన.
మరోవైపు సినిమాకు ఎంఎం కీరవాణి స్వరాలు అందించబోతుండటం మరో విశేషంగా చెప్పుకోవాలి. గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆకట్టుకోబోతున్న ఈ సినిమా టీ-సిరీస్ బ్యానర్ పై 500 కోట్ల రూపాయిలతో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మరి, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ ప్రేక్షకులను ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











