CCL 2026: అఖిల్ అక్కినేని సెంచరీతో వీర విహారం.. తెలుగు వారియర్స్ సంచలన విజయం
ప్రతిష్టాత్మకమైన సినీ క్రికెట్ టోర్ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 సంచలనాలతో కొనసాగుతున్నది. తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ అఖిల్ అక్కినేని బ్యాట్‌తో వీర విహారం చేసి సెంచరీ సాధించాడు. దాంతో తెలుగు వారియర్స్ జట్టు భారీ స్కోర్ చేసి పంజాబ్ ది షేర్ జట్టుకు తిరుగులేని సవాల్ విసిరింది. కెప్టెన్‌గా అఖిల్ అన్ని విభాగాల్లో రాణించి జట్టుకు స్పూర్తిని అందించాడు. దాంతో సమిష్టిగా ఆడిన తెలుగు సినీ స్టార్స్ జట్టు పంజాబ్ సినీ స్టార్స్ జట్టును చిత్తుగా ఓడించింది. అఖిల్ అక్కినేని సాధించిన సెంచరీ వివరాల్లోకి వెళితే..
తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచిన కెప్టెన్ అఖిల్ అక్కినేని.. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నాడు. ఆశ్విన్ బాబుతో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. తొలి బంతి నుంచే ధాటిగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి వారిని బెంబేలెత్తించాడు. బంతులను స్టేడియం అన్ని వైపుల తరలించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అఖిల్ కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇక పంజాబ్ విజయలక్ష్యానికి అఖిల్ తన కెప్టెన్సీతో అడ్డుగా నిలిచాడు. జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించాడు. బౌలర్లను మార్చుతూ పంజాబ్ ఆటగాళ్లను తికమకపెట్టారు. తెలుగు వారియర్స్ జట్టు బౌలర్లు వెంటవెంటనే వికెట్లు పడగొట్టడంతో ఏ దశలోను పంజాబ్ కోలుకోనివ్వకుండా తన ప్రతిభను మైదానంలో అఖిల్ చాటాడు. ఈ మ్యాచ్‌లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రతిభను చాటిన అఖిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు అఖిల్ నాయకత్వ ప్రతిభ, బ్యాటింగ్ చేసిన తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. అవార్డు అందజేస్తున్న సమయంలో తమన్ మాట్లాడుతూ.. విజయం సాధించి పెడుతానని చెప్పి అఖిల్ గెలుపును అందించాడు. ఈ మ్యాచ్ విజయాన్ని అఖిల్‌కు అంకితం ఇస్తున్నాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











