తమిళ దర్శకుడితో అల్లరి నరేష్ న్యూ ప్రాజెక్ట్.. నాంది తరహాలోనే మరో ప్రయోగం
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కామెడీ సినిమాలతో వరుసగా బాక్సాఫీసు హిట్స్ అందుకున్న అల్లరినరేష్ ఆ తర్వాత మెల్లగా తన మార్కెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. సీనియర్ కామెడీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్ ఆయన మార్క్ కు తగ్గట్లుగానే నరేష్ కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచులు కూడా చాలా మారిపోయాయి అని తెలుసుకున్న అల్లరి నరేష్ తన స్టైల్ కూడా పూర్తిగా మార్చేశాడు. మధ్యలో మధ్యలో కొన్ని ప్రయోగాలు చేశాడు కానీ అవి ఏమాత్రం వర్కౌట్ కాలేదు. గత ఏడాది అతను చేసిన ప్రయోగం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించింది. కమర్షియల్ అంశాలను పూర్తి భిన్నంగా చేసిన నాంది సినిమా అల్లరి నరేష్ మార్కెట్ను మళ్ళీ వెనక్కి తెచ్చింది.
ఎప్పుడో పదేళ్ల క్రితం అందుకున్న సక్సెస్ ను మళ్ళీ చాలా కాలం తర్వాత చూడడంతో నరేష్ భావోద్వేగానికి కూడా గురయ్యాడు. మళ్లీ ఇకనుంచి కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కాన్సెప్ట్ సినిమాలు కూడా చేస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నట్లుగానే ప్రస్తుతం అల్లరి నరేష్ డిఫరెంట్ కథల కోసం చర్చలు జరుపుతున్నారు. నాంది సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ అందులో రొటీన్ కమర్షియల్ కథలు ఎక్కువగా ఉండటంతో అలాంటి కథలు చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని దర్శకులకు కూడా సున్నితంగా సమాధానం చెప్పాడట. అయితే కాన్సెప్ట్ నచ్చితే అల్లరి నరేష్ దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ కూడా చూడడం లేదని కూడా తెలుస్తోంది.

కథ బాగుంటే చిత్ర నిర్మాతలను కూడా అల్లరి నరేష్ బాధ్యతగా సెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల ఒక తమిళ దర్శకుడు చెప్పిన విభిన్నమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ సినిమా కూడా నాంది తరహాలో ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు సమాచారం. ఇంతవరకు ఎవరు చూపించని ఒక అంశాన్ని నరేష్ అందులో హైలెట్ చేయబోతున్నాడట. రాజమోహన్ అనే తమిళ దర్శకుడు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పని చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ రైటర్ అబ్బూరి రవి అతన్ని అల్లరి నరేష్ కు పరిచయం చేయగా సింగిల్ సిట్టింగ్ లోనే ప్రాజెక్టుపై పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఒక నిర్మాత తో కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రాజెక్టు ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే ఆ ప్రాజెక్టు కూడా వీలైనంత తొందరగా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అయితే ఇది వరకే నరేష్ 'సభకు నమస్కారం' అనే సినిమాను మొదలు పెట్టాడు. అయితే ఆ చిత్ర నిర్మాత హటాత్తుగా మరణించడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఆ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక నరేష్ ఆ మూవీ ఫినిష్ అవ్వకముందే తమిళ దర్శకుడితో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











