తిత్లీ: రూ. 25 లక్షల విరాళం అందించిన అల్లు అర్జున్
తిత్లీ తుఫాన్ ఉత్తరాంధ్ర జిల్లాలను తీవ్రంగా నష్టపరిచింది. ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఈ తుఫాన్ కారణంగా భారీగా ఆస్తినష్టం జరుగడంతో పాటు ఎంతో మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు స్టార్స్ అక్కడి ప్రజలను ఆదుకునేందుకు విరాళాలు అందజేస్తున్నారు.
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తిత్లి తుఫాన్ బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడిస్తూ ప్రతి ఒక్కరూ తుఫాను బాధితులకు తమ వంతు సహాయం అందించాలని కోరారు.

తిత్లి తుపాన్ బాధితుల కోసం ఇప్పటికే బాలకృష్ణ రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ. 15 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, వరుణ్ తేజ్ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50 వేలు విరాళం అందించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరికొందరు స్టార్స్ సైతం విరాళం అందించారు.
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే... బన్నీ నటించిన చివరి సినిమా 'నా పేరు సూర్య' వేసవిలో విడుదలైంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇంకా ఏ సినిమాకు కమిట్ కాలేదు. బన్నీ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్‌తో ఉండే అవకాశం ఉందని టాక్.


Click it and Unblock the Notifications











