మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్: ‘పుష్ప’ తర్వాత చేసేది ఆ సినిమానే
యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అతడు.. గత ఏడాది సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన స్పందనతో హిట్ టాక్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
'అల' హిట్ ఇచ్చిన ఉత్సాహంతోనే అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 13, 2021న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ఓ పోస్టర్‌ను విడుదల చేసి మరీ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు.

ఇక, 'పుష్ప' పట్టాలపై ఉండగానే అల్లు అర్జున్.. కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే.. అల్లు అర్జున్ మరో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, సదరు దర్శకుడు చెప్పిన పాయింట్ బన్నీకి బాగా నచ్చిందని ప్రచారం జరుగుతోంది. దీంతో మొత్తం కథను సిద్ధం చేయమని వంశీకి స్టైలిష్ స్టార్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, 'పుష్ప' తర్వాత కొరటాలతో సినిమా చేసి.. దాని అనంతరం ఈ మూవీ చేస్తానని బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











