అల్లు అర్జున్‌ని భయపెట్టిన ఒకే ఒక్క డైరెక్టర్.. ఐకాన్‌స్టారైనా వణుకే.. ఆ దర్శకుడు ఎవరంటే?
దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. డ్యాన్స్, ఫైట్స్, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు. అలాంటిది అల్లు అర్జున్‌ని ఒకే ఒక్క డైరెక్టర్ భయపెట్టారట. ఈ వివరాల్లోకి వెళితే..
గంగోత్రితో హీరోగా ఎంట్రీ
దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి చిత్రంతో హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్.. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆర్య నుంచి యూత్ ఐకాన్‌గా మారిన బన్నీ.. స్టైలీష్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కమర్షియల్ సినిమాలే చేస్తున్నప్పటికీ.. ఎంచుకునే కథల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటూ హిట్స్ కొడుతున్నారు అల్లు అర్జున్. పరుగు, వరుడు, బద్రీనాథ్, రుద్రమదేవి వంటి విలక్షణ చిత్రాలతో ఎలాంటి పాత్రలోనైనా తాను నటించగలనని నిరూపించారు. రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురం చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు బన్నీ.

జాతీయ ఉత్తమ నటుడిగా ఘనత
ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాలు .. అల్లు అర్జున్ క్రేజ్‌ను ఎవరెస్ట్‌కు చేర్చాయి. ఈ రెండు సినిమాలతో ఐకాన్‌స్టార్‌గా ఎదిగిన బన్నీ.. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచారు. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు, కేరళ తదితర ప్రాంతాలకే పరిమితమైన బన్నీ క్రేజ్.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిని దాటింది. పుష్ప 2 ఆయన ఏకంగా బాలీవుడ్ స్టార్స్‌ను కూడా షేక్ చేశారు. పుష్పలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు.
భారీగా అల్లు అర్జున్ - అట్లీ మూవీ
ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటి వరకు ఇండియాలో రాని సబ్జెక్ట్‌తో, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అట్లీ తెలిపారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించనున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇది కాకుండా టాలీవుడ్ టూ బాలీవుడ్ అల్లు అర్జున్‌తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు.
అల్లు అర్జున్‌ని భయపెట్టిన డైరెక్టర్
ఇకపోతే తెలుగు చిత్ర సీమలో మెగా, అల్లు కుటుంబాల స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు బన్నీ తాను సొంతంగా సంపాదించుకున్న ఫ్యాన్ బేస్‌తో ఆయన టాలీవుడ్‌లో తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి. అలాంటిది అల్లు అర్జున్‌కి ఓ డైరెక్టర్ అంటే భయమట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దర్శకుడే చెప్పాడు. ఆయనెవరో కాదు.. ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ ఎస్వీ కృష్ణారెడ్డి. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా అల్లు అర్జున్
హీరో కావడానికి ముందు ఎస్వీ కృష్ణారెడ్డి వద్ద పెళ్లాం ఊరెళితే చిత్రానికి అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిశారట. ఈ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. కొడుకుని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్న అరవింద్.. స్క్రిప్ట్, షూటింగ్ సంబంధించిన విషయాలపై అవగాహన కోసం ఎస్వీ కృష్ణారెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయమని చెప్పారట. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ డైరెక్టర్ కావడంతో ఆయనంటే బన్నీకి బాగా భయం ఉండేదట. దీంతో ఆయన పట్ల గౌరవంతోనే బన్నీ మెలిగేవారట. ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే ఇండస్ట్రీలో నాకు ఎవరన్నా భయం లేదని.. కానీ మీరంటే మాత్రం భయమని అల్లు అర్జున్ చెప్పారని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











