పట్టాలెక్కక ముందే ట్రెండ్ అవుతోన్న బన్నీ సినిమా: ఫ్యాన్స్‌లో పెరిగిన ఆసక్తి
టాలీవుడ్‌లోనే టాప్ ప్రొడ్యూసర్‌గా పేరొందిన అల్లు అరవింద్ కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. 'గంగోత్రి'తో హీరోగా పరిచయం అయిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్నాడు. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే మూవీ చేస్తున్నాడు బన్నీ. ఇది పట్టాలపై ఉండగానే మరో బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వెలువడింది. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. 2021 ద్వితియార్థంలో ఇది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక, 2022లో ఈ మూవీ రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

అల్లు అర్జున్ 21వ సినిమాగా రాబోతున్న దీన్ని AA21 అనే పేరుతో ప్రకటించారు. ఇప్పుడీ పేరు ట్విట్టర్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ హ్యాష్ ట్యాగ్‌పై దాదాపు పదహారు వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ పేరు మరోసారి మారుమ్రోగిపోతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ట్రెండ్ అవడంతో దాని నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందేమోనని స్టైలిష్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, పొలిటికల్ నేపథ్యంతో సాగే మెసేజ్‌తో రూపొందనున్న ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











