Allu Arjun Net Worth: స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు... అల్లు అర్జున్ ఆస్తులు ఎన్ని కోట్లంటే?
మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఆయన కుటుంబం నుంచి దాదాపు డజను మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు మెగాస్టార్ వారసులుగా బరిలోకి దిగారు. తర్వాతి తరంలో చిరంజీవి బావమరిది, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, దివంగత అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ఏప్రిల్ 8న తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కెరీర్, రికార్డులు, ఆయన సంపద వంటి వివరాలు చూస్తే:
అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 8 ఏప్రిల్ 1982న చెన్నైలో రెండో సంతానంగా జన్మించారు అల్లు అర్జున్. చెన్నైలోనే ఆయన బాల్యం గడవగా అక్కడి సెయింట్ ప్యాట్రిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంతో అల్లు కుటుంబం కూడా భాగ్యనగరంలో స్థిరపడింది. ఇక్కడి ఎంఎస్ఆర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అల్లు అర్జున్.

నాలుగేళ్ల వయసులోనే తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేతలో బాలనటుడిగా నటించారు అల్లు అర్జున్. ఆ తర్వాత ఏడాది కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యంలో మహానటుడు కమల్ హాసన్‌కు మనవడిగా నటించారు. 2003లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు బన్నీ. తొలి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్న అల్లు అర్జున్ కెరీర్‌ను ఆర్య మలుపు తిప్పింది. ఈ సినిమాతో యూత్‌లో ఫాలోయింగ్‌తో పాటు స్టైలీష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు బన్నీ.
అనంతరం బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, బద్రీనాథ్, జులాయ్, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, డీజే, అల వైకుంఠపురంలో చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ దశలో పుష్ప సిరీస్‌తో ఆయన పాన్ ఇండియా స్టార్, ఐకాన్‌స్టార్‌గా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తన 22వ చిత్రంలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఇది కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.
2011 మార్చి 16న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అల్లు ఆర్హా. తన తొలి సినిమాకు రాఘవేంద్రరావు చేతుల మీదుగా 100 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరు. సినిమాకు రూ.200 నుంచి రూ.300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు బన్నీ. సినిమాలు, వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలతో ఆయన భారీగానే ఆస్తులు కూడబెట్టారు. ఏఏఏ పేరుతో మల్టీప్లెక్స్‌లతో పాటు బఫెలో వైల్డ్ వింగ్స్ రెస్టారెంట్స్, హెల్త్‌కేర్ రంగంలో కాల్ హెల్త్ సర్వీసెస్ వ్యాపారాలు నిర్వహిస్తూ బిజినెస్‌మెన్‌గానూ సత్తాచాటారు అల్లు అర్జున్.
గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్ధతో పాటు ఆహా ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. అలాగే అల్లు స్టూడియో పేరుతో సొంత స్టూడియోను నిర్మించిన ఆయన.. దాని కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బన్నీకి విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ రూ.100 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. అల్లు అర్జున్ వద్ద ఖరీదైన రేంజ్ రోవర్ వాగ్యూ, వోల్వో ఎక్స్‌సీ 90 టీ8 ఎక్స్‌లెన్స్, హమ్మర్ హెచ్ 2 ఉన్నాయి. మొత్తంగా అల్లు అర్జున్ ఆస్తుల విలువ 500 కోట్లకు పై మాటేనని టాలీవుడ్ టాక్. అల్లు అర్జున్ జీవితంలో మరెన్నో విజయాలు సాధించి, మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications


















