Pawan Kalyan: వరద బాధితులకు పవన్ కల్యాణ్ అండ.. సీఎం సహాయ నిధికి భారీ విరాళం
Pawan Kalyan: గత వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు నీటముగాయి. దీంతో భారీ ఆస్తినష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇలా కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్న వరద బాధితులకు ఉపముఖ్యమంత్రి అండగా నిలిచారు. వారి కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
అంతకు ముందు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకెళ్లి.. వరద బాధితుల పరిస్థితి పరిశీలించారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ సహాయ నిధికి రూ. కోటీ ప్రకటించారు.

బాధితుల ప్రాంతాలను పరిశీలించాక పవన్ కల్యాణ్ మీడియా వారితో ముచ్చటించారు. గత సర్కారు తప్పిదం కారణంగానే ఏపీ రాష్ట్రం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరును గత ప్రభుత్వం విస్మరించిందని పవన్ ధ్వజమెత్తారు. అంతేకాకుండా ప్రాజెక్టుల విషయంలో అయితే వైసీపీ ప్రభుత్వం నెగ్లెట్ చేసిందని ఫైర్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటూ పవన్ మనసు కలచివేస్తుందని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కావని ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు వహిస్తామని తెలిపారు.
ఇకపోతే ఏపీ, తెలంగాణ వరద బాధితులకు సహాయ నిధిగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు భారీ విరాళాలు ప్రకటించారు. ముందుగా వరద భాదితుల్ని ఆదుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ కోటీ రూపాయలు ప్రకటించారు. తర్వాత తారక్ అభిమాని అయిన యంగ్ హీరో విశ్వక్ సేన్ ఉభయ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెరి 5 లక్షల విరాళం ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు 30 లక్షల రూపాయలు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ 50 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరీ రూ. 20 లక్షలు, నందమూరి హీరో బాలయ్య కోటీ రూపాయలు, అశ్వినీదత్ రూ. 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కోటీ రూపాయలు ప్రకటించడంతో ఫ్యాన్స్ డిప్యూటీ సీఎంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ఈ పరిస్థితి చక్కబడేవరకు నేను ఎటు వెళ్లను మీతోనే ఉంటానని ఏపీ ప్రజలకు అండగా ఉంటున్నారు. దగ్గరుండి మరీ పలువురు టీడీపీ అధికారులు ఫుడ్, వాటర్ సప్లై చేస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రాణాలు పోవడం తీవ్ర విషాదమని చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా స్పందించి.. ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాకపోతే ఇలాంటి టైంలోనే అధికారులు తక్షణమే స్పందించి సహాయ చర్యలు అందించాలని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు అధైర్యపడొద్దని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితుల దగ్గరే ఉన్నారని, సహాయక చర్యలు వేగవంగం చేస్తున్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications











