ఆ పార్టీతో సంబంధం లేదు.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు.. అల్లు అర్జున్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కొద్దిగంటల్లో ముగుస్తుందనగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షం కావడం దుమారం రేపింది. తన ప్రాణమిత్రుడు వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్ధతు పలికిన ఆయన .. రవిని గెలిపించాలంటూ అతని చేయి పట్టుకుని మరీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బన్నీ రాకతో నంద్యాల రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఆయనను చూసేందుకు నంద్యాల వాసులు శిల్పా రవి ఇంటికి పోటెత్తారు.
అయితే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్ధతుగా నిలిచింది. చిరంజీవి, నాగబాబు, సురేఖ, రాంచరణ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్‌లు పిఠాపురానికి వెళ్లి పవన్‌కు మద్దతు ప్రకటించారు. వీరిలో కొందరు ఇంటింటికి వెళ్లి కూటమిని గెలిపించాలని ప్రచారం చేశారు. అలా కుటుంబం మొత్తం పవన్‌కు వెన్నుదన్నుగా ఉంటే బన్నీ ఇలా చేశారేంటీ అంటూ ప్రజలు , మెగా అభిమానులు షాక్‌కు గురయ్యారు.

ఈ విమర్శలకు తన తిరుగు ప్రయాణంలోనే సమాధానం చెప్పారు అల్లు అర్జున్. 2019లోనూ శిల్పా రవికి మద్ధతు ప్రకటించానని, ఆయన గెలవాలని ట్వీట్ చేశానని గుర్తుచేశారు. అయితే ఈసారి ట్వీట్ సరిపోదని.. అందుకే వ్యక్తిగతంగా కలిసి మద్ధతు ప్రకటించానని బన్నీ తెలిపారు.
గత ఐదేళ్లుగా శిల్పా రవి కష్టపడటం చూస్తున్నానని, రాజకీయాల్లో ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని బన్నీ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై మెగా, పవన్ అభిమానులు భగ్గుమంటున్నారు. పవన్ కోసమైతే ట్వీట్ సరిపోతుందా.. శిల్పా రవి ఐదేళ్ల హార్డ్ వర్క్ గురించి చెబుతున్న అల్లు అర్జున్‌కి పవన్ పదేళ్ల కష్టం కనిపించడం లేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

తన నంద్యాల పర్యటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్‌పై బన్నీ స్పందించారు. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వెళ్లిన అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం బన్నీని మీడియా చుట్టుముట్టింది. నంద్యాల వెళ్లడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కుండబద్ధలు కొట్టారు. నా అనుకున్న వాళ్లు ఏ పార్టీలో వున్నా వారికి నా మద్ధతు వుంటుందని బన్నీ స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే శిల్పా రవికి సపోర్ట్ చేశానని ఆయన క్లారిటీ ఇచ్చారు.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రవిని కలవడం కుదరలేదని.. అందుకే ఈసారి వ్యక్తిగతంగా వెళ్లి కలిశానని అల్లు అర్జున్ తెలిపారు. పవన్ కళ్యాణ్, బన్నీవాసు, తన మామగారు చంద్రశేఖర్ రెడ్డిలకు తన మద్ధతు ఎప్పుడూ వుంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించాలని అల్లు అర్జున్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరి బన్నీ సమాధానంతో మెగా, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు శాంతిస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











