పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షూటింగ్స్ కు సిద్దమవుతున్న పవర్ స్టార్!
జనసేన పార్టీని స్థాపించి దాదాపు పదేళ్ల పోరాటం, ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను దిగమింగి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎంగా, ఆరు కీలక శాఖలకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాలనా వ్యవహారాలు, రాజకీయాలతో పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అంతా బాగానే ఉన్నా.. తమ ఫేవరేట్ స్టార్‌ను వెండితెరపై మళ్లీ చూస్తామా లేదా అన్న నిరాశ ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది.
తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సినీ పరిశ్రమకు పవన్ గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చిందా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు పార్టీ అధినేత తను కావాలనుకున్నప్పుడు కాల్షీట్లు కేటాయించి, అవసరమైన సమయంలో జనం మధ్యలోకి వెళ్లారు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు లేవు. పాలనను గాలికొదిలేసి ముఖానికి మేకప్ వేసుకుంటానంటే రాజకీయ ప్రత్యర్ధులు చూస్తూ ఊరుకుంటారా. అసలే పవన్ ఎక్కడ దొరుకుతాడా అని వైసీపీ కాచుకుని కూర్చొంది. అలాంటి వేళ తనకు తానుగా బురదజల్లే అవకాశాన్ని జనసేనాని చేజేతులా ఇస్తారా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే చాలామంది అన్న నందమూరి తారక రామారావుతో పవన్‌ను పోల్చి చూస్తున్నారు. తెలుగు చిత్రసీమలో నటసార్వభౌముడిగా , మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ ఆ ఇమేజ్‌తోనే రాజకీయాల్లోకి వెళ్లి. తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే కాంగ్రెస్ కంచుకోటను బద్ధలుకొట్టారు. అప్పటి వరకు రాజకీయమంటే తెలియని జన సామాన్యంలో చైతన్యం తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఉంటూనే రామారావు నటించారు. నిర్మాతగా సినిమాలను సైతం నిర్మించారు. ఎన్టీఆర్ పని అయిపోయింది అనుకున్న సమయంలో సినిమాలే ఆయనను రాజకీయంగా గట్టెక్కించాయని విశ్లేషకులు చెబుతారు.
పవన్ కళ్యాణ్ కూడా అన్నగారి బాటలోనే సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ భాగం కావొచ్చని కొందరు సలహాలు ఇస్తున్నారు. అయితే ఆల్రెడీ కమిటైన సినిమాలను పూర్తి చేసి నిర్మాతలను ఒడ్డున పడేయ్యాలని పవన్ భావిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. వీటిలో ఓజీ కంప్లీట్ కావొచ్చింది.. కేవలం పవన్ చేయాల్సిన పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఆయన రాక కోసం చిత్ర యూనిట్, అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ నుంచి తిరిగి షూటింగ్‌లో పవన్ పాల్గొంటారన్నది దాని సారాంశం. తను ఆల్రెడీ కమిట్ అయిన ఓజీ, హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్‌లను పూర్తి చేయడానికి నెలకు 10 రోజులు కేటాయిస్తారని సమాచారం. డిప్యూటీ సీఎం హోదాలో పూర్తిగా రాజకీయాలు, ప్రజాసేవకే సమయం కేటాయించాలని అనుకుంటున్నందున కొత్త సినిమాలకు పవన్ సైన్ చేయరని జనసేన వర్గాల టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే జనసేనాని వచ్చే నెల నుంచి షూటింగ్‌లో పాల్గొంటారా , లేదా అన్నది త్వరలోనే తెలిసిపోనుంది.


Click it and Unblock the Notifications











