అవెంజర్స్ దెబ్బ పడింది.. బాధగా ఉన్నా తప్పడం లేదు.. నిఖిల్!
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు టీఎన్ సంతోష్ ఉత్కంఠ భరిత అంశాలతో రూపొందించారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అర్జున్ సురవరం చిత్ర విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మే 1న ఈ చిత్రం విడుదల కావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో చిత్ర యూనిట్ కి మరో షాక్ తగిలింది. విడుదలకు కేవలం 5 రోజులు ఉందనగా మరోమారు వాయిదా వేశారు.
సినిమాని వాయిదా వేయడానికి గల కారణాలని నిఖిల్ సోషల్ మీడియాలో వివరించాడు. ఏడాది కాలంగా మంచి కథతో మా చిత్ర యూనిట్ అర్జున్ సురవరం చిత్రం కోసం కష్టపడ్డాం. మే 1న విడుదల చేసి మీ అభిమానాన్ని పొందాలనుకున్నాం. విడుదల కోసం ఎదురుచూస్తున్న సమయంలో అవెంజర్స్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అవెంజర్స్ థానోస్ ని ఎదిరించి ప్రపంచం కోసం పోరాడుతారు. అదే విధంగా అర్జున్ సురవరం కూడా స్టూడెంట్స్ కోసం పోరాడుతాడని నిఖిల్ తెలిపాడు.

అవెంజర్స్ విడుదల కానుండడంతో ఈ సమయంలో సినిమాని విడుదల చేయడం మంచిది కాదని డిస్ట్రిబ్యూటర్లు సూచించారు. సినిమాని డబ్బు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవించి సినిమాని వాయిదా వేస్తున్నట్లు నిఖిల్ ప్రకటించాడు. ఈ నిర్ణయం బాధని కలిగించేలా ఉన్నా తప్పడం లేదని నిఖిల్ తెలిపాడు. మరో గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నా అని నిఖిల్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











