Elections 2024: వైఎస్ జగన్‌ను ఓడించి పవన్ కల్యాణే సీఎం.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
సినీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జాతకాలు చెబుతూ సెలబ్రెటీగా మారిపోయారు వేణుస్వామి. ఈయన చెప్పిన చాలా జోస్యాలు ఫలించడంతో ఎంతోమంది స్వామి ఇంటికి క్యూకట్టారు. ముఖ్యంగా సమంత - నాగచైతన్య విడిపోతారనే ముందే చెప్పడం.. ఆయన అన్నట్లుగానే ఈ స్టార్ కపుల్ డైవర్స్ తీసుకోవడంతో అంతా షాకయ్యారు. జీవితంలో పైకి రావడానికి, సెలబ్రెటీలకు ఏమైనా సమస్యలు ఉంటే వారి కోసం ప్రత్యేకంగా పూజలు జరిపించడంతో వేణుస్వామి సిద్ధహస్తుడు. రష్మిక మందన్న, సమంత, డింపుల్ హయాతి, అషు రెడ్డి, నిధి అగర్వాల్ ఇలా ఎంతోమంది స్టార్స్ కోసం పూజలు చేయించాడు వేణుస్వామి. అయితే సదరు పూజల్లో మద్యం, వైన్ బాటిళ్లు కనిపించడంతో కాంట్రవర్సీలు కూడా అయ్యాయి.
అయితే వేణుస్వామి చెప్పే జోస్యం తేడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలో ఆయన చెప్పే మాటలు ఎప్పుడూ ఫలించకపోగా, కాంట్రవర్సీకి దారి తీశాయి. డార్లింగ్ పని అయిపోయిందని, ఇక హిట్లు రావని, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు. వేణుస్వామి అన్నట్లుగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సలార్ కూడా ఫ్లాప్ అవుతుందని ప్రభాస్ జాతకం ప్రకారం హిట్ ఇప్పట్లో రాదని చెప్పాడు. అయితే సలార్ మంచి టాక్‌తో దూసుకుపోవడంతో డార్లింగ్ అభిమానులు వేణుస్వామిని దారుణంగా ట్రోలింగ్ చేశారు. కానీ సినిమా పరంగా సలార్ ఓకే కానీ , చాలా ఏరియాల్లో నష్టాలు వచ్చాయని ఇండస్ట్రీ చెబుతోంది.

ఇదే కాదు.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని వేణుస్వామి చెప్పారు. కానీ చంద్రశేఖర్ రావు ఓడిపోయారు. ఐపీఎల్‌లో హైదరాబాద్ గెలుస్తుందన్నారు కానీ .. ఫైనల్‌లో ఆ జట్టు బొక్కబొర్లా పడింది. తాజాగా పవన్ ఫ్యాన్స్ చేతికి చిక్కారు వేణుస్వామి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ గెలుపుపై ఆయన కంటే అభిమానులే ధీమాగా ఉన్నారు. సర్వేలు సైతం జనసేనకు అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి వేళ తన నోటికి పనిచెప్పారు వేణుస్వామి. పవన్ ఎమ్మెల్యేగా గెలవొచ్చు కానీ సీఎం మాత్రం అయ్యే అవకాశం లేదన్నారు. పవన్ కళ్యాణ్ జాతకంలో సీఎం అయ్యే యోగం లేదని .. రాజకీయాలలో మోసపోతారని వేణుస్వామి అన్నారు.
ఈ జోస్యంతో పవన్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. వేణుస్వామిపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌కు దిగిన వారు.. ఆయన సక్సెస్ రేట్ 98 శాతం చెప్పుకుంటారని, కానీ స్వామి చెప్పిన విషయాలు అన్నీ జరుగుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ మండిపడుతున్నారు. కొందరైతే గతంలో వేణుస్వామి ప్రముఖుల విషయంలో చెప్పిన జోస్యాలు, అవి ఫెయిలైన విషయాలను గుర్తుచేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ దెబ్బకు దిగొచ్చారో లేక మరేదైనా కారణమో కానీ పవన్ జాతకం విషయంలో వేణుస్వామి మాట మార్చినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే కోరిక తనకు కూడా ఉందని, పవన్ అంటే విపరీతమైన పిచ్చి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నానని వేణుస్వామి అన్నారు. ఆ వీడియో ప్రస్తుతానిదో లేదంటే ఆయన గతంలో అన్న మాటలను ఎడిట్ చేసి వీడియోగా మార్చారో కానీ ఇది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణుస్వామిలో ఎంత మార్పు వచ్చిందో కదూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











