సినిమాల్లో అట్టర్ ఫ్లాప్ .. బిజినెస్‌లో ఏడాదిలో 8500 కోట్లు కొట్టిన ఫెయిల్యూర్ స్టార్.. ఎవరంటే?
సినీ పరిశ్రమలో వెలిగిపోవాలనే కలతో ఎంతో మంది ఈ రంగుల ప్రపంచంలో అడుగుపెడుతుంటారు. ఇక బలమైన సినీ నేపథ్యం, కుబేరుల వారసులకు కూడా ఇండస్ట్రీలో నెట్టుకోవడం కష్టమే. ఇలాంటి వారు టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎంతోమంది. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ఇండియాలోని ప్రఖ్యాత వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు వివేక్. స్టార్ హీరో కావాలని కలలు కన్న ఆయనకు సినిమాలలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు.
రక్తచరిత్రతో తెలుగులో ఎంట్రీ
2002లో కంపెనీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వివేక్ ఒబెరాయ్. ఆ తర్వాత సాథియా, మస్తి, కాల్, ఓంకార, కర్బన్, గ్రాండ్ మస్తి, క్రిష్ 3, వివేగమ్, లూసిఫర్, వినయ విధేయ రామ, కడువా సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత టీడీపీ నేత పరిటాల రవి జీవిత కథ ఆథారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్తచరిత్రలో టైటిల్ రోల్ పోషించారు వివేక్. ఈ సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు.

తెలుగువారి ప్రేమను మరిచిపోలేను
తెలుగువారు తనపై చూపించిన ప్రేమను ఎప్పుడూ మరిచిపోనని వివేక్ ఒబెరాయ్ పలుమార్లు తెలిపారు. రక్తచరిత్ర విడుదలైనప్పుడు స్క్రీనింగ్ కోసం హైదరాబాద్ వచ్చానని.. సినిమాలో తన ఎంట్రీ సీన్ సమయంలో ప్రేక్షకులు ఈలలు, అరుపులతో గోల గోల చేశారని గుర్తుచేసుకున్నారు. రక్త చరిత్ర, రక్త చరిత్ర 2లు విడుదలైన దాదాపు 9 ఏళ్ల తర్వాత 2017లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో విలన్‌గా నటించారు వివేక్. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ ఆయన నటించలేదు. 2007లో నటించిన షూటౌట్ అట్ లోఖండ్ వాలా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్‌లో వివేక్ పేరు మారుమోగిపోయింది. ఈ దెబ్బతో స్టార్ రేసులోకి ఆయన వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన దాదాపు 2 ఏళ్ల పాటు ఖాళీగానే ఉన్నారు.
సినిమాల్లో కష్టం
అనతికాలంలోనే సినీ పరిశ్రమలో తన భవిష్యత్ ఏంటో ఆయన గ్రహించారు. కొందరి నియంత్రణలోనే బాలీవుడ్ నడుస్తోందని.. వారి చేతికి తాను చిక్కకూడదని వివేక్ ఒబెరాయ్ భావించారు. అలాగే ఆఫర్ల కోసం మీడియేటర్ల మీద ఆధారపడకూడదని.. అందుకే వ్యాపారం మీద దృష్టిపెట్టినట్లు ఆయన తెలిపారు. సినిమాల్లో సక్సెస్ కాకపోయినా, వ్యాపార రంగంలో మాత్రం వివేక్ ఒబెరాయ్ సక్సెస్ కొట్టారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న 12 కంపెనీల కోసం ఏకంగా 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 8500 కోట్ల రూపాయలు) సేకరించారు. వీటిలో 2 కంపెనీలు త్వరలోనే ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాబోతున్నాయి.
8500 కోట్లు సేకరించిన వివేక్
బిజినెస్‌లో తన సక్సెస్‌పై వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఈ విజయానికి తన తండ్రి సురేశ్ ఒబెరాయే కారణమన్నారు. చిన్నప్పటి నుంచి వ్యాపారం ఎలా చేయాలి? లాభాలు ఎలా గడించాలి? అనే సూత్రాలను ఆయన నేర్పించారని వివేక్ చెప్పారు. వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి తన 12 కంపెనీల కోసం 8500 కోట్ల రూపాయల నిధులను సేకరించినట్లు తెలిపారు. ఆ నిధులను ఎలా వినియోగిస్తున్నాం.. ఆ నిధుల నుంచి ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యమన్నారు. ఎప్పుడూ లాభాల్లో ఉండాలనేది వ్యాపారవేత్త లక్ష్యంగా ఉండాలని మా నాన్న చెప్పేవారని వివేక్ ఒబెరాయ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications











