కెరీర్‌లో చివరి స్టేజ్‌లో ఉన్నా .. అందుకే ఇకపై, స్టార్ హీరో సంచలన నిర్ణయం
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ . నటనతో పాటు వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అమీర్. మూడున్నర దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రను వేసిన ఆయన తన సినిమాల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అమీర్ ఖాన్‌కు కయామత్ సే కయామత్ తక్ హీరోగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 90వ దశకం నుంచి ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై అమీర్‌ఖాన్ శకం మొదలైంది.
2001లో వచ్చిన లగాన్ ఆయనను ఇంటర్నేషనల్ సూపర్‌స్టార్‌గా మార్చింది. 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, దిల్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్ , మంగళ్ పాండే, ఫనా, గజిని, పీకే , దంగల్ వంటి సినిమాలు బాక్సాఫీసు రికార్డులను తిరగరాశాయి. ఆయన నటించిన దంగల్ .. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో నెంబర్‌వన్‌గా నిలిచింది. నేటికీ ఈ రికార్డు పదిలంగానే ఉంది.

బాలీవుడ్‌ను శాసిస్తున్న ఖాన్ త్రయంలో ఒకరిగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న అమీర్.. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. అపర కుబేరుడైనా సరే సామాన్యుడిలా నిరాడంబరంగా ఉంటారు. తలచుకుంటే ఛార్టెర్డ్ ఫ్లైట్‌నే కొనగలిగే స్థోమత ఉన్నప్పటికీ.. సాధారణ వ్యక్తిలా ఎకానమీ క్లాస్‌లోనే వెళ్లడానికి అమీర్ ఇష్టపడతారు. తొలుత తన సహనటి రీనా దత్తాను పెళ్లాడారు అమీర్.. ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమారుడు సంతానం. అనివార్య కారణాలతో ఈ జంట విడిపోయింది.. అనంతరం దర్శకురాలు కిరణ్ రావును అమీర్ ఖాన్ 2005లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ రావ్ అనే కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం కిరణ్ రావు - అమీర్ ఖాన్ విడిపోయిన సంగతి తెలిసిందే.
కాగా.. అమీర్ ఖాన్ నిర్మించిన లాపతా లేడీస్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలులో వెళ్తూ తప్పిపోయిన ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. లింగ సమానత్వం, సమాజంలో జరిగే అంశాలను దర్శకురాలు కిరణ్ రావు అద్భుతంగా చూపించారు. సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లాపతా లేడీస్ చిత్రాన్ని శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఆవరణలో ప్రదర్శించారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో అమీర్ , కిరణ్ రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా , లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని.. కెరీర్ పరంగా ఇది తన చివరి దశ అని.. మహా అయితే ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేయగలుగుతానని అమీర్ వ్యాఖ్యానించారు. భారతదేశం, సమాజం, చిత్ర పరిశ్రమ తనకెంతో ఇచ్చిందని.. వారికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఉద్దేశంతో నిర్మాతగా మంచి కథలను సమాజానికి అందించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కొత్త దర్శకులు, రచయితలు, నటీనటులకు అవకాశం కల్పించి ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలని భావించినట్లు వెల్లడించారు. దీనిలో భాగంగానే లాపతా లేడీస్‌ను తెరకెక్కించానని మిస్టర్ పర్ఫెక్ట్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











