పదేళ్ల నిరీక్షణ... ఎట్టకేలకు బీటెక్ పాసైన స్టార్ హీరో, పట్టాతో ఇంటికి
సినిమాలో రాణించడం అంత తేలిక కాదు. ఇష్టమైనవి వదులుకోవాలి, ఎన్నో త్యాగాలు చేయాలి. అయినప్పటికీ సక్సెస్ కొడతామన్న గ్యారెంటీ లేదు. కానీ లక్ష్యాన్ని పక్కన పెట్టకుండా శ్రమించిన వారు ఎందరో. సినిమాల కోసం చదువును పక్కనపెట్టిన వారు, ఎన్ని కష్టాలు ఎదురైనా మధ్యలో చదువును పూర్తి చేసిన వారెందరో. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్.
ఖాన్‌లు , కపూర్‌లు, చోప్రాలు వంటి స్టార్ హీరోలు రాజ్యమేలుతున్న బాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా రాణించడం ఆషామాషీ కాదు. అక్కడి నెపోటిజానికి, రాజకీయాలకు ఎంతోమంది వర్థమాన, టాలెంటెడ్ నటీనటులు బలైపోయారు. గాడ్ ఫాదర్ లేకుండా బాలీవుడ్‌లో రాణించడం అంత ఈజీ కాదు. అలాంటిది ఎలాంటి సపోర్ట్ లేకుండా తన స్వయంకృషి, ప్రతిభ, క్రమశిక్షణతో దేశంలోని స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగారు కార్తీక్ ఆర్యన్.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పుట్టిన కార్తీక్ ఆర్యన్ అసలు పేరు కార్తీక్ తివారీ. ఆయన తల్లిదండ్రులు డాక్టర్లు. తొలుత మోడలింగ్‌లో అడుగుపెట్టిన కార్తీక్.. సినిమాల్లో అవకాశాల కోసం ఎంతో శ్రమించారు. 2011లో ప్యార్ కే పంచనామా సినిమాతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి వెండితెరపై అడుగుపెట్టారు కార్తీక్. ఆ తర్వాత సిల్ వత్చ, సోనుకి టిటుకీ స్వీటీ, లుకా చప్పి, పతి పత్నీ ఔర్ ఓ, లవ్ ఆజ్ కాల్, ధమాకా వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్‌పై జైత్రయాత్ర చేస్తున్న సమయంలో భూల్ భూలయ్యా 2తో హిందీ ఇండస్ట్రీ పరువు నిలబెట్టారు కార్తీక్. ఇక హీరోయిన్‌లతో ప్రేమాయణాల ద్వారా కూడా ఆయన అంతే ఫేమస్ అయ్యారు. స్వతహాగా మధ్యతరగతి నుంచి రావడంతో పాటు సినిమాల కోసం పడిన కష్టం కళ్లారా చూశాకా తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో ఆయనకు లగ్జరీ ఇళ్లతో పాటు ఖరీదైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ ఆస్తుల విలువ రూ. 100 కోట్ల పై మాటే. గతేడాది భూల్ భూలయ్య 3తో మరోసారి భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు కార్తీక్ ఆర్యన్.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా , బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్న కార్తీక్ ఆర్యన్ కెరీర్‌లో సక్సెస్ కొట్టారు. తాజాగా ఆయన తన మరో కలను నెరవేర్చుకున్నారు. అదేంటో కాదు బీటెక్ డిగ్రీ. ముంబైలోని ప్రఖ్యాత డీవై పాటిల్ యూనివర్సిటీలో బీటెక్‌లో చేరిన ఆయన దాదాపు పదేళ్ల తర్వాత పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ యాజమాన్యం ఆయనకు బీటెక్ పట్టాను అందించి ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన పేరున్న జెర్సీని ధరించి విద్యార్ధులతో డ్యాన్స్‌లు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications










