ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. ఒత్తిడిలో నాగార్జున.. బిగ్‌బాస్ షోను కింగ్ హ్యాండిల్ చేయగలరా?
కష్టం , సుఖం ఉంటేనే మనిషి జీవితం. చీకటి వెంట వెలుగు ఉన్నట్లే.. బాధ వెనుక కచ్చితంగా సంతోషం ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. గాలి వానలు ఎదురైనా చెట్టు నిటారుగా నిలబడినట్లు మనిషి కూడా కష్టాలను, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తుంటారు. సామాన్యులే కాదు.. ప్రముఖులకు కూడా కష్టాలు తప్పవు. ఎందరో సమస్యలను అధిగమించి జీవితాన్ని గెలిచి నిలిచారు.
ఇదిలాఉండగా.. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రభుత్వ అధికారులు కూల్చివేసిన వ్యవహారం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తుమ్మడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేయాలని ఎప్పటి నుంచో పలువురు సామాజికవేత్తలు, ప్రజలు ఫిర్యాదులు చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పటికీ ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది.

ఇలాంటి దశలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియమించిన హైడ్రా.. ఆక్రమ కట్టడాలను కూలుస్తూ నాగార్జున ఎన్ కన్వెన్షన్ పనిపట్టింది. తనకొచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు సూచించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత హైడ్రా కూల్చివేతకు దిగింది. అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం బాధ కలిగించిందని నాగార్జున పేర్కొన్నారు.
విషయం కోర్టులో ఉందని.. ఒకవేళ న్యాయస్థానం తనను దోషిగా తేలిస్తే తానే కూల్చివేసే పనులు చేపట్టేవాడినని తెలిపారు. దీనిపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ సైతం వివరణ ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని తేల్చిచెప్పారు. ఎన్ కన్వెన్షన్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని, ఇది అక్రమ కట్టడమని రంగనాథ్ అన్నారు. నిబంధనల్ని అనుసరించి, చట్ట ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మరికొద్దిరోజుల్లో మొదలవ్వనున్న బిగ్‌బాస్ తెలుగు 8 షోను నాగార్జున పర్ఫెక్ట్‌గా హోస్ట్ చేయగలరా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ 8 తెలుగు షోకు హోస్ట్‌గా అంగీకరిస్తూ ఇప్పటికే హాట్‌స్టార్ అగ్రిమెంట్‌పై నాగ్ సైన్ చేశారు. హోస్ట్‌గా వ్యవహరించే వ్యక్తి బిగ్‌బాస్ షోను కంట్రోల్ చేయడంతో పాటు కంటెస్టెంట్స్ చేసే తప్పులను ఎత్తిచూపుతూ షో గాడి తప్పకుండా పర్యవేక్షించాలి. గడిచిన కొన్నేళ్లుగా నాగార్జున అద్భుతంగా హోస్ట్ చేస్తూ.. బిగ్‌బాస్ తెలుగునాట పాపులర్ కావడంలో తనవంతు పాత్ర పోషించారు. లేటెస్ట్‌గా ఎన్ కన్వెన్షన్ ఇష్యూస్‌తో నాగార్జున తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే జీవితంలో ఇలాంటి ఒత్తిళ్లు , టెన్షన్ నాగార్జునకు కొత్త కాదని .. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఆయన ఎన్నో సవాళ్లను ఫేస్ చేసి ఈ స్థాయికి చేరుకున్నారని అక్కినేని ఫ్యాన్స్ చెబుతున్నారు. బిగ్‌బాస్ షో నాగ్‌కు కొత్త కాదని.. గత సీజన్‌ల మాదిరిగానే బిగ్‌బాస్ 8 తెలుగును తన హోస్టింగ్ స్కిల్స్‌తో అద్భుతంగా నడిపిస్తారని అంటున్నారు. వృత్తిపట్ల ఆయన డెడికేషన్‌ను అనుమానించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











