పాలిటిక్స్ మొదలు పెట్టిన చిరు, చరణ్.. వేర్వేరు రాజకీయ పార్టీలతో రంగంలోకి?
అదేమిటి తనకు రాజకీయం వద్దు సినిమాలతో బిజీగా ఉన్నాను అన్న చిరంజీవి రాజకీయాలు చేయడం ఏంటి? ఆయన చేస్తే చేశారు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న రామ్ చరణ్ కూడా రాజకీయం చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే వారు రాజకీయం చేస్తోంది సినిమాల్లో అండి, నిజ జీవితంలో కాదు. అసలు ఆ సంగతులు ఏంటో తెలుసుకుందాం రండి.

'గాడ్ ఫాదర్'గా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' సినిమా తెరకెక్కుతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆ సినిమాలో మోహన్ లాల్ పాత్రను మెగాస్టార్ చిరంజీవి పోషిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాలిటిక్స్ శాసించే కింగ్ మేకర్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నాడు.

జన జాగృతి పార్టీ కోసం చిరంజీవి
పాలిటిక్స్ లో ఉంటూనే ఏ మాత్రం అవినీతి మకిలి అంటని ఒక నిజాయితీగల పొలిటీషియన్ పాత్ర ఆయన పోషించనున్నారు. ఈ సినిమాలో 'జన జాగృతి' అనే పొలిటికల్ పార్టీలో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా ఆయన కనిపించబోతున్నాడు. కరోనా నుంచి కోలుకున్న చిరంజీవి.. ఈ మధ్యే మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. అప్పుడే ఆయన స్వయంగా లొకేషన్ ఫోటోలు షేర్ చేయడంతో అవి బయటికి వచ్చాయి. అందులో జన జాగృతి పార్టీ బ్యానర్ కనిపిస్తుంది.

చరణ్ కూడా రాజకీయాలతో
తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీ పేరుకి దగ్గరగా ఉన్న ఈ పేరు సినిమాలో కనిపించడంతో పెద్ద చర్చే జరిగింది. ఆ సంగతి అలా ఉంచితే రామ్ చరణ్ కూడా రాజకీయాలకు సంబంధం ఉన్న సినిమానే చేస్తున్నాడని అంటున్నారు. చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ఒకదాన్ని చేస్తున్నారు. దానికి ఇంకా పేరు పెట్టకపోవడంతో ప్రస్తుతానికి దాన్ని RC15 అని పిలుస్తున్నారు.

'అభ్యుదయ పార్టీ కోసం చరణ్
250 కోట్లతో ఈ సినిమాను దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. దిల్ రాజు అల్లుడు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ ఇష్యూస్ చర్చించడంలో మంచి పేరు తెచ్చుకున్న శంకర్ ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ ను పొలిటికల్ లీడర్ గా చూపించబోతున్నారు. ఒక నిజాయితీ గల బ్యూరోక్రాట్ ప్రభుత్వంతో పోరాడేందుకు బయటకు వచ్చేసి 'అభ్యుదయ పార్టీ' అనే ఒక పార్టీ ఏర్పాటు చేసి పోరాడేలా కధ ఉంటుందని అంటున్నారు. అలా తండ్రి చిరంజీవి గాడ్ ఫాదర్ కోసం జన జాగృతి పార్టీతో పని చేస్తుంటే చరణ్ శంకర్ సినిమా కోసం ఈ అభ్యుదయ పార్టీతో కలిసి పని చేయనున్నారు.

చిరు మొదలుపెట్టిన చోటనే
శంకర్- చరణ్ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పుణేలో మొదటి షెడ్యూల్ పూర్తి కాగా ఇప్పుడు రెండో షెడ్యూల్ ఈ మధ్యే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తిరిగి ప్రారంభించారు. చిరు తెరంగేట్రం చేసిన 'పునాది రాళ్లు' సినిమాలో మొదటి సన్నివేశాన్ని 1978 ఫిబ్రవరి 11న తూర్పు గోదావరిలోని దోసకాయలపల్లిలోనే చిత్రీకరించగా సరిగ్గా 43 ఏళ్ల తర్వాత అదే రోజు అదే ఊళ్ళో రామ్ చరణ్, శంకర్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.


Click it and Unblock the Notifications











