ఊహించుకొంటేనే భయంగా ఉంది.. వందల కోట్ల నష్టమే.. చిరంజీవి ఆందోళన
కరోనావైరస్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ లాక్‌డౌన్ వల్ల పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో అర్థం కావడం లేదు. రానున్న కాలాన్ని ఊహించుకొంటేనే భయంగా ఉందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఇండస్ట్రీ స్తంభించడంతో రోజు వారీ సినీ కార్మికులను ఆదుకొనేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసి బాధితులను ఆదుకొంటూనే పరిశ్రమను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నంగా చర్యలు చేపట్టారు. ఇటీవల ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ..

పరిశ్రమను వెంటాడుతున్న కరోనా
సినీ పరిశ్రమను కరోనావైరస్ ఎంతగా వెంటాడుతున్నదంటే మాటల్లో కూడా చెప్పలేం. ఒక దేశం నుంచి మరో దేశంలోకి ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయం తెలుసుకొంటే ఆందోళన రేకెత్తింది. సమూహాలుగా ప్రజలు తిరగకుండా ఉండటమే ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంటి పట్టునే ఉంటూ వైరస్‌ను అడ్డుకోవాలి అని చిరంజీవి పిలుపు నిచ్చారు.

కరోనా ముపుతో వెంటనే స్పందించా
కరోనా ముప్పు పొంచి ఉందనే విషయం తెలుసుకొని వెంటనే దర్శకుడు కొరటాల శివతో మాట్లాడాను. వెంటనే ఆచార్య సినిమా షూటింగ్‌ను ఆపివేశాం. అదేరోజు సాయంత్రం మల్టిప్లెక్సులు, థియేటర్లను మూసివేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది అనే విషయాన్ని మెగాస్టార్ పేర్కొన్నారు.

కార్మికుల కష్టాలను తీర్చేందుకు
సినీ పరిశ్రమ కార్యకలాపాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో రోజువారీ కార్మికులు కష్టాల్లో పడ్డారు. వారిని ఆదుకొనే విషయంపై ఇండస్ట్రీ పెద్దలతో సంప్రదింపులు జరిపాను. వెంటనే కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశాం. నిర్మాతలు, యాక్టర్లు, ఇతర సాంకేతిక నిపుణులు విరాళాలు అందించి స్పందించారు.

సినీ పరిశ్రమపై ఊహించని దెబ్బ
కరోనా కారణంగా సినీ పరిశ్రమపై భారీ దెబ్బ పడుతుంది. ఎంత నష్టం వాటిల్లుతుందనే విషయంపై ఓ నిర్ధారణకు రావడం చాలా కష్టం. కాకపోతే వందల కోట్ల మేరకు నష్టం ఉంటుందనే విషయాన్ని చెప్పగలను. ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయో.. షూటింగ్స్ ఎప్పుడూ మొదలవుతాయో ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే సినీ పరిశ్రమ తొందరగానే ఈ కష్టకాలాన్ని ఎదురించి నిలబడుతుందనే విశ్వాసం మాత్రం నాకు ఉంది అని చిరంజీవి చెప్పారు.
Recommended Video

నిర్మాతలకు కష్టాలే..
లాక్‌డౌన్ తర్వాత సినీ పరిశ్రమలోనే పెద్దలు, నిర్మాతలు, ఫైనాన్షియర్స్, ఇతరలందరం కలిసి మాట్లాడుకొంటాం. ఫైనాన్షియర్స్‌ను వడ్డీ రేట్లను తగ్గించి నిర్మాతలను ఆదుకోవాలని కోరుతున్నాం. కేవలం ఈ నష్టాలు ఒక్క సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదు. అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని మళ్లీ గత వైభవాన్ని చాటుకొంటాం అని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











