యూట్యూబ్‌లో మెగాస్టార్ హవా: దూసుకుపోతోన్న చిరంజీవి కొత్త మూవీ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆచార్య'. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. కొద్ది రోజుల బ్యాలెన్స్ వర్క్ మిగిలి ఉన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో చిత్రీకరణ నిలిచిపోయింది. దీంతో సినిమా విడుదల కూడా వాయిదా పడిపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి యూట్యూబ్‌లో హవాను చూపిస్తూ తాజాగా అరుదైన మైలురాయిని చేరారు.
కొద్ది రోజుల క్రితం 'ఆచార్య' మూవీ నుంచి 'లాహే లాహే' అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. యంగ్ సింగర్స్ హారిక నారాయణన్, సాహితీ చాంగంటి ఈ పాటను ఆలపించారు. ఇక, ఈ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ సంగీతం క్లాసికల్ డ్యాన్స్, చిరంజీవి గ్రేస్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మెలోడీ సాంగ్ 60 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య' నుంచి త్వరలోనే రెండో సాంగ్ కూడా విడుదల కాబోతుందని అంటున్నారు. అంతేకాదు, ఇది రామ్ చరణ్.. పూజా హెగ్డే మధ్య సాగే 'నీలాంబరి' అనే పాట అన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా... ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోలిద్దరూ నక్సలైట్లుగా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











