బాలకృష్ణకు, బోయపాటికి సవాల్ విసిరిన చిరంజీవి!
నందమూరి వారసుడు, నటరత్న బాలకృష్ణ సినీ సర్ణోత్సవ కార్యక్రమం కన్నుల పండుగా సాగింది. తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ పరిశ్రమలోని దిగ్గజాలైన రజనీకాంత్, చిరంజీవి, శివరాజ్ కుమార్, ఉపేంద్ర లాంటి హీరోలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సినీ డైరెక్టర్లకు ఓ ఛాలెంజ్ విసిరారు. ఆ సవాల్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి లాంటి ఫ్యాక్షన్ సినిమాలతో బాలయ్య సక్సెస్ జోరులో ఉన్నప్పుడు ఇంద్ర సినిమా కథ నా వద్దకు వచ్చింది. అయితే ఫ్యాక్షన్ కథ అనగానే కొంత వెనక్కి జంకిన మాట వాస్తవం. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షన్ అంటే బాలకృష్ణ గుర్తుకు వస్తాడు. అలాంటి పాత్రలకు పెట్టింది పేరు బాలయ్య అని చిరంజీవి ప్రశంసించారు.

సమరసింహా రెడ్డి లాంటి పాత్రలు చేసి ఒప్పించాలంటే.. చాలా కష్టం. ఇంద్ర సేనారెడ్డి పాత్రను చేయాలన్నప్పుడు తర్జనభర్జన పడ్డాను. కానీ ఆ కథ విన్న తర్వాత నేను ఆ పాత్ర చేయడానికి సిద్దమయ్యాను. ఇంద్రను కూడా ఆదరించి భారీ విజయాన్ని అందించారు. అలా నేను ఫ్యాక్షన్ సినిమా చేయడం జరిగింది అని చిరంజీవి తెలిపారు.
సినిమా పరిశ్రమలో సీక్వెల్స్, ప్రీక్వెల్స్ వస్తున్నాయి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అంటూ సీక్వెల్స్ వస్తున్నాయి. ఎవరైనా రచయితలు ముందుకు వచ్చి.. సమరసింహారెడ్డి వర్సెస్ ఇంద్రసేనా రెడ్డి అనే కథను, క్యారెక్టర్లను రాస్తే నేను నటించడానికి సిద్దం. బాలయ్య నీవు కూడా రెడీనా అని చిరంజీవి అడిగితే.. వెంటనే బాలయ్య నేను రెడీ రెడీ అంటూ ఉత్సాహంతో సమాధానం ఇచ్చారు.
ఇక స్టేజ్ కింద ఉన్న బోయపాటి శ్రీనును ఉద్దేశించి మాట్లాడుతూ... బోయపాటి ఉత్సాహం ఉన్నావు. నా ఛాలెంజ్ విసురుతున్నాను. తీసుకో అంటూ పలికారు. ఇక్కడ చాలా మంది రచయితలు ఉన్నారు. ఎవరి నుంచి ఎలాంటి ఆలోచన, కథ వస్తుందో తెలియదు. కాబట్టి ఈ ఛాలెంజ్‌ను ఎవరైనా స్వీకరించి మంచి కథను రాస్తే నేను నటించడానికి సిద్దమే అంటూ చిరంజీవి అన్నారు.
ఇదిలా ఉండగా, ఇంద్ర మూవీ ఇటీవల రీ రిలీజ్ అవ్వడమే కాకుండా భారీ వసూళ్లు సాధించింది. రెండు మూడు రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. చాలా ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమా నేటితరం ప్రేక్షకులను కూడా ఉత్సాహానికి గురి చేయడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











