Venkatesh Net Worth: విక్టరీ వెంకటేష్ ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా? టాలీవుడ్‌లో ఏకైక హీరోగా రికార్డ్!
మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు విక్టరీ వెంకటేష్. సినిమాలపై ఆసక్తి లేకపోయినా.. తండ్రి బలవంతం మీద నటన వైపు వచ్చిన వెంకీమామ.. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడి స్థాయికి ఎదిగారు. నాలుగు దశాబ్ధాలుగా టాలీవుడ్‌కు నాలుగు మూలస్తంభాలైన హీరోలలో ఒకరిగా నిలిచారు. డిసెంబర్ 13న దగ్గుబాటి వెంకటేష్ పుట్టినరోజు. ఈరోజుతో ఆయన 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ కెరీర్, రికార్డులు, ఆయన ఆస్తులు ఇతర విషయాలు పరిశీలిస్తే...
రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు 1960 డిసెంబర్ 13న మద్రాస్‌లో జన్మించారు వెంకటేష్. ఆయనకు సోదరుడు సురేష్ బాబు, చెల్లెలు లక్ష్మీ ఉన్నారు. చెన్నై డాన్‌బాస్కో స్కూల్‌లో చదువుకున్న వెంకటేష్.. ఆ తర్వాతే అక్కడి లయోలా కాలేజీలో బీకాం పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో ఎంబీఏ చదివారు. భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత తమ కుటుంబానికి చెందిన సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు లేదా వ్యాపారవేత్తగా ఎదిగాలని వెంకీ మామ భావించారు. కానీ విధి మరోలా ఆలోచించింది.

ఆ సమయంలో సూపర్‌స్టార్ కృష్ణతో రామానాయుడు ఓ సినిమాను తీయాలని ప్లాన్ చేయగా.. కృష్ణగారి డేట్స్ అస్సలు ఖాళీ లేవు. దాంతో నాకు బదులుగా మీ అబ్బాయి వెంకటేష్‌తోనే సినిమా తీయమని సూపర్‌స్టార్ సలహా ఇవ్వడంతో రామానాయుడు దానిపై ఆలోచించి వెంకటేష్‌కు విషయం చెప్పగా ఆయన అస్సలు ఒప్పుకోలేదు. అయితే తండ్రి బలవంతం మీద హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా 1986లో కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తెలుగు రాకపోవడంతో డైలాగులు చెప్పలేకపోయినా, అంతగా నటించకపోయినా వెంకటేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఆ తర్వాత బ్రహ్మరుద్రలు, శ్రీనివాస కళ్యాణం, స్వర్ణకమలం వంటి కల్ట్ క్లాసిక్స్‌లో నటించారు. అయితే 90వ దశకంలో వచ్చిన బొబ్బిలిరాజా సినిమాతో మాస్ హీరోగా స్టార్‌డమ్ అందుకున్నారు వెంకీ. అనంతరం శత్రువు, కూలీ నెం.1, క్షణక్షణం, సుందరకాండ, చంటి, కొండపల్లి రాజా, అబ్బాయిగారు తదితర చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరై.. మహిళా ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారారు. పెళ్లి చేసుకుందాం రా, ప్రేమించకుందాం రా, సూర్యవంశం, రాజా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్‌బస్టర్స్‌తో తిరుగులేని స్థాయికి చేరారు. చంటితో తొలి 10 కోట్ల రూపాయల సినిమాని, కలిసుందాం రాతో తొలి 25 కోట్ల రూపాయలు చిత్రాలను టాలీవుడ్‌కి అందించారు.
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో టాలీవుడ్‌లోని నలుగురు అగ్రహీరోలలో 300 కోట్ల రూపాయల గ్రాస్ అందుకున్న తొలి హీరోగా నిలిచారు వెంకీ. 40 ఏళ్ల కెరీర్‌లో 80 చిత్రాలలో నటించిన వెంకటేష్‌కు దాదాపు 75 శాతం సక్సెస్ రేట్ ఉంది. టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా, విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు వెంకటేష్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ రీమేక్‌లలో నటించిన హీరోగా.. సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత ఈ జనరేషన్‌లో మల్టీస్టారర్స్‌ని ప్రోత్సహించిన హీరోగా వెంకటేష్ నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 7 నంది అవార్డుల్ని .. 6 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను అందుకున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ 47- ఏకే 47 సినిమాలో వెంకీ నటిస్తున్నారు. 1985లో నీరజతో వెంకటేష్ వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుటుంబంతో గడిపేందుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. 40 ఏళ్ల కెరీర్‌లో ఎలాంటి వివాదం లేకుండా, మచ్చలేని మనిషిగా వెంకీ నిలిచారు.
ఇక వెంకటేష్ ఆస్తుల విషయానికి వస్తే ... తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో పాటు ఆయన కూడా బాగానే కూడబెట్టారని ఫిలింనగర్ టాక్. వెంకటేష్ సినిమాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారని అంచనా. తన సంపాదనలో ఎక్కువగా సినిమాల నుంచి వస్తుంది. ఈ మొత్తాన్ని రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలలో వెంకటేష్ పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతారు. హైదరాబాద్, చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వెంకటేష్‌కు వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. మొత్తంగా ఆయన ఆస్తుల విలువ 2500 కోట్ల రూపాయల పైమాటేనని విశ్లేషకుల అంచనా. వెంకటేష్ జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











