సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సినిమాలో ఊహించని పాత్రలో వెంకటేష్.. ఆ లోటు తీరుతుందా?
వయసు పైబడుతున్నా కుర్ర హీరోలతో పోటీ పడుతున్న వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. పేరుకు సీనియర్ హీరోనే అయినా.. జూనియర్లకు ఏమాత్రం తీసిపోకుండా యాక్టివ్‌గా ఉంటారు. అందుకే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దీనికి తోడు ఫ్యామిలీ చిత్రాలతో ఎంతో మంది లేడీ ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నారు. అయితే, కొద్దిరోజులుగా ఆయన స్పీడు తగ్గించారు. ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసిన వెంకీ.. ఇప్పుడు మాత్రం సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన ఎన్నో సినిమాల్లో పోలీస్‌లా కనిపించారు. అయితే, ఘర్షణలో మాత్రం సీరియస్‌గా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. అందులో వెంకటేష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అన్నట్లు ఈ సినిమాకు 'సినిమా చూపిస్త మామ', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' వంటి చిత్రాలు తెరకెక్కించిన త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తారని టాక్.

వెంకటేష్ ఈ సంవత్సరం ఆరంభంలో 'F2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'F2' భారీ వసూళ్లను రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. కుటుంబ సమేతంగా వచ్చి గ్రాండ్ సక్సెస్‌ను అందించారు. ఇక, తాజాగా వెంకటేష్.. నాగ చైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే త్రినాథరావు సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











