అలా 3 సినిమాల్లో హీరోగా తీసేశారు... దండోరా నటుడి షాకింగ్ కామెంట్స్
భారతీయ సమాజంలో కులం ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని రంగాలు, వ్యవస్థలు, వ్యక్తులను వేల ఏళ్ల నుంచి నేటి వరకు కులమే శాసిస్తోందన్నది బహిరంగ రహస్యం. కుల వివక్షను రూపుమాపడానికి జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే వంటి మహనీయులు తమ జీవితాలను ధారపోశారు. కానీ నేటికీ భారతీయ సమాజాన్ని కులం వదిలిపోవడం లేదు. కుల వివక్ష కారణంగా ఎంతోమంది ప్రతిభావంతులు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. నేటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది ఒక్క రంగానికే పరిమితం కాలేదు.. అన్నిరంగాలను పట్టి పీడిస్తోంది. తాజాగా కులం కారణంగా ఎన్నో అవకాశాలను కోల్పోయానని ఓ తెలుగు నటుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బుల్లితెర నుంచి వెండితెర వైపు
అతను ఎవరో కాదు.. బుల్లితెర నటుడు రవికృష్ణ. విజయవాడకు చెందిన ఈ కుర్రాడు తొలుత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హృదయం, బొమ్మరిల్లు, మొగలిరేకులు, వరూధిని పరిణయం, మనసు మమత, దట్ ఈజ్ మహాలక్ష్మీ, సుందరకాండ, బావ మరదళ్లు తదితర సీరియల్స్‌లో నటించారు. ఈ దశలో బిగ్‌బాస్ తెలుగు 3వ సీజన్‌లో అవకాశం దక్కించుకున్నాడు రవికృష్ణ. దాదాపు 70 రోజుల పాటు హౌస్‌లో నిలిచిన అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు. బిగ్‌బాస్ తర్వాత రవికృష్ణ మరింత పాపులర్ అయ్యాడు. సినిమాలలోనూ అవకాశాలు వచ్చాయి. అనుభవించు రాజా, విరూపక్ష, లవ్ మీ, ది బర్త్ డే బాయ్, కింగ్డమ్ తదితర చిత్రాలలో రవికృష్ణ నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన దండోరా చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

డిసెంబర్ 25న దండోరా
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని దండోరా చిత్రాన్ని నిర్మించారు. నవదీప్, నందు, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దండోరా మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గారపు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన దండోరా మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. హీరో శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన హాట్ కామెంట్స్‌తో దండోరా మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన రవికృష్ణ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కులంపై రవికృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ డైరెక్టర్ నన్ను లవర్‌బాయ్‌ని చేశాడు
విరూపక్ష సినిమాలో నా నటన చూసిన తర్వాత దండోరా దర్శకుడు నన్ను సంప్రదించారు. మిమ్మల్ని అందరూ ఆ యాంగిల్‌లో చూశారు కదా? మీరు నాకు లవర్ బాయ్‌గా కనిపిస్తున్నారు. ఒక క్యారెక్టర్ ఉంది మీకు నచ్చుతుందా అని అడిగారు. ఒకసారి కథ వింటానని చెప్పగా.. సరేనని ఇంటర్వ్యూలో ఓ చిన్న ట్విస్ట్ చెప్పారు. దీనిలో సాంగ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి.. కమర్షియల్ హీరోగా ఒక చిన్న సినిమాగా మిమ్మల్ని ఎంపిక చేసుకోవడానికి మీ కెరీర్‌కు హెల్ప్ అవుతుందని డైరెక్టర్ గారు చెప్పారు. కథ విన్నాక నాకు మంచిగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంత మంచి కథలో మనం కూడా ఒక పిల్లర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది అని రవికృష్ణ అన్నారు.
మా అబ్బాయివి కాదా అని అవమానించారు
విజయవాడలో కులం, రాజకీయాలు ఈ తరహా వాతావరణం ఎక్కువగా ఉండేది. చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూనే ఉన్నా. స్కూల్‌లో, కాలేజీలో కూడా నడిచేవి. ఎక్కడికెళ్లినా మీరెంటీ? మీదెంటీ? అని అడిగేవారు. స్టార్టింగ్‌లో మనకి అర్ధం అయ్యేది కాదు.. ఇంట్లో అడిగితే అప్పుడు చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రత్యక్షంగా ఫేస్ చేశాను. దాని గురించి మాట్లాడటానికి అందరూ భయపడతారు. ఇంట్రెస్ట్ చూపించరు. ఇండస్ట్రీలోకి అంత స్ట్రాంగ్ పొజిషన్‌కి వెళ్లాక నా వాయిస్ రైజ్ చేస్తా. స్టార్టింగ్ డేస్‌లో సెలెక్ట్ అయ్యి, అన్ని అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ చేయడానికి మీ పేరు ఇవ్వండి అని అడిగితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ పంపిస్తాం కదా. దానిలో ఫుల్ నేమ్ చూసి, సర్ నేమ్ చూసి.. మా అబ్బాయి అనుకున్నాం కాదా... మళ్లీ చెబుతామని అలా 3, 4 ప్రాజెక్ట్స్ పోయాయి. డైరెక్ట్‌గా నో చెప్పలేక కొంతమంది ఇబ్బందిపడి.. హీరోగా ఒప్పుకున్నాం కదా? ప్రెజర్ ఉంది ఫ్రెండ్ క్యారెక్టర్ అంటున్నారు అని చెబితే దానికి కూడా ఒప్పుకున్నా? నువ్వు హీరో కంటే కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తున్నావ్.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చూద్దాం అని పంపించేసేవారని రవికృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











