Sir Teaser: విద్యావ్యవస్దపై ధనుష్ బాణాలు.. గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యం అంటూ ఎమోషనల్!
తమిళ హీరో ధనుష్ తెలుగు వారికీ సుపరిచితమే. ఒకప్పుడు రజనీకాంత్ అల్లుడిగా పరిచయం అయినా ఆయన తనకంటూ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు. ఇక మొట్టమొదటి సారిగా ధనుష్ డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

'సార్'
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్న 'సార్' సినిమా తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ సినిమాను శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నాగ వంశీనిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ 'సార్'కు సమర్పకునిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

మేళవింపులా
నిజానికి తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు), 'వాతి', (తమిళం) షూటింగ్ కార్యక్రమాలు దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. 'సార్' సినిమాలో ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్న ఈ సినిమా టీజర్ ధనుష్ పుట్టినరోజు సంధర్భంగా ఈ రోజు విడుదల అయింది. ఇక తాజాగా విడుదల అయిన ధనుష్ 'సార్' టీజర్ విషయానికి వస్తే ఈ 'సార్' సినిమా యాక్షన్, ఎమోషన్ల మేళవింపులాగా కనిప్సిస్తోంది.
ఎక్కు పెట్టిన బాణంలా
ఇక టీజర్ లో కనిపించిన సంభాషణలు సైతం దానికి అద్దం పడుతున్నాయి. ఇక టీజర్ లో ఒక పాత్ర "జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్" ఇదే రా ఇప్పటి ట్రెండ్ అని అనడం ఆసక్తికరంగా మారింది. అలాగే మరోచోట ఓ లెక్చరర్ ''త్రిపాఠి మన కాలేజ్ లోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీకి పంపించేస్తే మన దగ్గరకి వచ్చి చదువుకునేది ఎవరు...!'' అనడం కనిపిస్తోంది. సమాధానంగా "మనం పంపేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ ని"... అని. ఆ పాత్ర సమాధానం ఇవ్వడంతో ఇది విద్యావ్యవస్దపై ఎక్కు పెట్టిన బాణంలాగా అనిపిస్తోంది.

స్టార్ హోటల్లో డిష్ లా
"సార్... మై సెల్ఫ్ బాల గంగాధర్ తిలక్, త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్.. అంటూ సినిమాలో ధనుష్ కనిపిస్తున్నారు. "విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం. పంచండి ...ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి" అంటూ ధనుష్ ఆవేదన మిళితమైన తీవ్ర స్వరంతో మాట్లాడడం ఆసక్తికరంగా మారింది.

కీలక పాత్రలలో
అరవై తొమ్మిది సెకన్ల పాటు సాగే ఈ టీజర్ 'సార్' పై మరింత అంచనాలు పెరిగేలా చేసిందని చెప్పకతప్పదు. ఇక తెలుగు, తమిళ భాషల్లో 'సార్' అక్టోబర్ లో విడుదలకానుంది. ఇక ఈ సినిమాలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











