పవన్ కల్యాణ్ స్టేట్ లీడర్ కాదు.. నేషనల్ లీడర్.. సముద్రఖని జోస్యం చెప్పినట్లే జరిగిందిగా..మీరే చూడండి!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్‌సభ సీట్లలో గెలుపొంది అధికారాన్ని అందుకుంది. ఈ విజయంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దశాబ్ధాల తర్వాత కేంద్రాన్ని శాసించే అదృష్టం కూడా కలిసి రావడంతో వారు ఆనందాన్ని తబ్బిబ్బవుతున్నారు. వీటన్నింటిలోకి పవన్ కళ్యాణ్ పేరు ఢిల్లీ స్థాయిలో మారుమోగిపోవడంతో జనసైనికులు పొంగిపోతున్నారు. పదేళ్లుగా ఎన్నో అవమానాల్ని దిగమింగి, ఛీత్కారాలను సైతం ఎదుర్కొని అపూర్వ విజయాన్ని అందుకున్నారు పవన్ . తను ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తనతో పాటు మరో 20 మందిని గెలిపించుకున్నారు.
కూటమికి ఈ స్థాయి విజయం దక్కడం వెనుక పవన్ కళ్యాణ్ కష్టం, త్యాగం, పోరాటం ఉన్నాయన్నది అందరూ అంగీకరించే మాట. అందుకే ఆయన సక్సెస్‌ను తమ సక్సెస్‌గా అభిమానులు , కుటుంబ సభ్యులు జరుపుకుంటున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం పవన్ గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నారు. ఎన్డీయే సమావేశానికి హాజరైన జనసేనానిని చూపిస్తూ.. ఆయన పవన్ కాదని, తుఫాన్ అంటూ ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే అపూర్వ విజయాన్ని అందుకుందని మోడీ కితాబిచ్చారు.

పవన్ కనీసం ఎమ్మెల్యేగానైనా గెలుపొందుతారా, అసెంబ్లీ గేటు తాకుతారా అంటూ ప్రత్యర్ధుల విమర్శలకు తన పనితీరుతోనే సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపొంది, పార్టీని గెలిపించి, కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం శాసించే స్థాయికి పవన్ చేరుకున్నారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర స్థాయి నేత కాదు.. జాతీయ స్థాయి నాయకుడు, కింగ్ మేకర్ అని అభిమానులు చెబుతున్నారు. ఈ సందర్భంలో ప్రముఖ దర్శకుడు , నటుడు సముద్రఖని అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. పవన్ స్టేట్ లీడర్ కాదు.. నేషనల్ లీడర్ అని ఆయన గతంలోనే వ్యాఖ్యానించారు.
నటుడిగా బిజీ అయిన సముద్రఖని చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మెగాఫోన్ పట్టుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో 'బ్రో ' సినిమాను ఆయన తెరకెక్కించారు. తాను స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'వినోదయ సిత్తం ' ఆధారంగా బ్రోను రూపొందించారు సముద్రఖని. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. బ్రో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌తో సముద్రఖని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
పవన్ ఎప్పుడు సింగిల్ షాట్‌లో సీన్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. నాలుగు పేజీల డైలాగ్స్‌తో సీన్ ఉంటే ఒకేసారి చేద్దామని అంటారని, అలాంటి నటుడిని చూడటం అదే ఫస్ట్ టైమ్ అని సముద్రఖని తెలిపారు. పవన్ ఎప్పుడు కనిపించినా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఐ లవ్ యూ అని చెబుతానని పవర్‌స్టార్ ఎనర్జీ వెరే లెవల్‌లో ఉంటుందన్నారు. బ్రో సినిమా కోసం ఆయనతో 21 రోజులు పనిచేశానని.. ఈ సమయంలో పవన్ విజన్, ఈ సొసైటీ గురించి ఆయన మైండ్‌లో ఉన్న విషయం మరో స్థాయిలో ఉందని సముద్రఖని తెలిపారు.
పవన్ స్టేట్ లీడర్ కాదు.. నేషనల్ లీడర్ అని ఆయన విజన్‌ని అప్లయ్ చేస్తే మనం పూర్తిగా కొత్త లోకంలో ఉంటామని సముద్రఖని ప్రశంసించారు. అది త్వరలోనే జరుగుతుందని.. ఆ శక్తిని భగవంతుడు పవన్‌కి ఇస్తాడని ఆయన అన్నారు. తాజా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది సాధించడంతో సముద్రఖని పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











