Dadasaheb Phalke Award: 300 సినిమాల్లో మిథున్.. పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ ఎంట్రీ.. ఆ మూవీ ఏంటో తెలుసా?
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు, పద్మ భూషణ్ మిథున్ చక్రవర్తికి అరుదైన గౌరవం లభించింది. భారతీయ సినిమా పరిశ్రమకు విశేషమైన సేవలు అందించిన ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనున్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. దాంతో మిథున్ అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మిథున్ చక్రవర్తి కెరీర్ విషయంలోకి వెళితే..
తొలి చిత్రంతోనే జాతీయ నటుడిగా
బెంగాల్‌కు చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్‌లోకి నటుడిగా 1976లో అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ దర్శకత్వంలో రూపొందిన మృగయ అనే సినిమా ద్వారా ఆయన హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హిందీలో నటించిన తొలి చిత్రమే ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందించింది. అదే సంవత్సరం దో అంజానే చిత్రంలో అమితాబ్, రేఖతో కలిసి నటించారు.

300 చిత్రాలకుపైగా
ఆ తర్వాత కెరీర్ పరంగా మిథున్ వెనక్కి తీరిగి చూసుకోలేదు. హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటి వరకు ఆయన తన కెరీర్‌లో సుమారుగా 300 చిత్రాల్లో నటించారు. హిందీలో సురక్ష, ప్రేమ్ వివాహ్, హమ్ పాంచ్, షౌకీన్ అలాంటి చిత్రాల్లో నటించి నటుడిగా నిలదొక్కుకొన్నారు.
డిస్కో డ్యాన్సర్‌తో సంచలనం
అయితే 1982 సంవత్సరంలో ఆయన నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రం పిల్లల నుంచి పెద్దల వరకు ఐయామ్ డిస్కో డ్యాన్సర్ అంటూ ఊగిపోయి స్టెప్పులేసేలా చేసింది. అప్పట్లో డిస్కో డ్యాన్సర్ పాటలన్నీ చార్ట్ బస్టర్లుగా మారాయి. ఆ తర్వాత డ్యాన్స్ డ్యాన్స్ కూడా భారీ హిట్ కావడంతో మిథున్ సూపర్ స్టార్‌గా మారిపోయారు.

తెలుగులో పవన్ కల్యాణ్‌తో
మిథున్ చక్రవర్తి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు. పవన్ కల్యాణ్, వెంకటేష్ నటించిన గోపాలా గోపాల సినిమాలో విలన్ టచ్ పాత్రలో కనిపించారు. స్వామిజీ పాత్రలో ఆడియెన్స్‌ను తనదైన నటనతో మెప్పించారు. ఆ తర్వాత మలుపు అనే సినిమాలో కూడా యాక్ట్ చేశారు.
రాజ్య సభ ఎంపీగా కూడా
మిథున్ సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. తొలుత మమతా బెనర్జీ నాయకత్వంలోనే తృణమూల్ కాంగ్రెస్‌లో 2014లో తీర్థం పుచ్చుకొన్నారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. అయితే తన పదవీ కాలం పూర్తికాకుండానే ఎంపీ పదవికి రాజీనామా చేసి 2021 సంవత్సరంలో బీజేపీలో చేరారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











