Prabhas Net Worth : కల్కి తర్వాత ప్రభాస్ ఆస్తుల విలువ ఎంత? ఎన్ని కోట్ల విలువైన సంపద అంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో స్నేహశీలిగా , మనసున్న మారాజుగా జేజేలు అందుకుంటున్నారు ప్రభాస్. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క మచ్చ కూడా లేకుండా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనను విమర్శించిన వారు లేరంటే ప్రభాస్ వ్యక్తిత్వం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. పాన్ ఇండియా హీరోగా ప్రజంట్ ప్రభాస్‌కున్నంత మార్కెట్, ఇమేజ్ బాలీవుడ్ ఖాన్‌లకు, కపూర్లకు కూడా లేదు. ప్రభాస్ సినిమా చేస్తే కలెక్షన్ల వర్షమేనని నిర్మాతలు ఫిక్స్ అయిపోతున్నారు. అంతటి స్టార్ హీరో అయినా నిరాడంబరంగా , మీడియాకు దూరంగా ఉండటానికే ఇష్టపపడతారు ప్రభాస్. ఈ రోజు డార్లింగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కుమారుడే ప్రభాస్. 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించారు ప్రభాస్. ఆయన పూర్తిపేరు.. ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. చెన్నై డాన్‌బాస్కో, భీమవరం డీఎన్ఆర్ కాలేజీలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన.. హైదరాబాద్ నలంద కాలేజీలో ఇంటర్ చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో బీటెక్ అభ్యసించారు. చదువు తర్వాత నటన వైపు వెళ్లాలని ప్రభాస్ భావించడంతో ఎందరో స్టార్లను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సత్యానంద్ వద్దకు పంపారు తల్లీదండ్రులు. మూడు నెలల శిక్షణ అనంతరం ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ ప్రోత్సాహంతో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్.

వర్షం, ఛత్రపతి సినిమాలతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్‌తో అమ్మాయిలలో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ సంపాదించారు. బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా నిలిచిన ఆయన శిఖరాగ్రాన్ని చేరారు. హిట్ , ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. రీసెంట్‌గా కల్కి 2898 ఏడీతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ 2, కల్కి 2తో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది రాజా సాబ్ మూవీని వేగంగా కంప్లీట్ చేస్తున్నారు ప్రభాస్. ఇది కాకుండా రీసెంట్‌గా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో మరో మూవీ సెట్స్‌పైకి ఎక్కింది. మంచితనానికి పెట్టింది పేరైన ప్రభాస్.. తన ఇంటికి ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టుకుండా పంపరు. తన మిత్రులు, సన్నిహితులకు బహుమతులు, స్వీట్లు పంపడం ప్రభాస్‌కు అలవాటు.
అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ యూనిట్ సభ్యులందరికీ తన ఇంటి నుంచి భోజనాలు తెప్పిస్తుంటాడు ప్రభాస్. ప్రజలు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. కేరళ, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటు చేసుకున్న వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల కోసం రూ. కోట్లలో విరాళాలు ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరో ప్రభాసే. చిన్న చిత్రాలకు బాసటగా నిలిచే హీరోలలో ఆయన ముందు వరుసలో ఉంటారు.

ఇన్నేళ్ల కెరీర్‌లో ప్రభాస్ ఎంత సంపాదించాడు? ఆయన ఆస్తులు ఎంత? అనేదానిపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. హైదరాబాద్, ముంబై, చెన్నై, భీమవరం, మొగల్తూరులలో ప్రభాస్ రూ. కోట్లాది విలువైన ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఇంటి విలువే రూ. 70 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ముంబైలో రీసెంట్‌గా కొనుగోలు చేసిన ఫ్లాట్ ధర రూ.15 కోట్లు అని ఫిలింనగర్ టాక్. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ప్రభాస్‌కు ఆస్తులున్నాయి. ఇటలీలోని లగ్జరీ భవంతి విలువ రూ. కోట్లలో ఉంటుంది.
కార్లంటే ఎంతో ఇష్టపడే ప్రభాస్ గ్యారేజీలో రూ. 7 కోట్ల విలువ లంబోర్ఘిని, రూ. 2 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ.2 కోట్ల విలువైనప మెర్సిడెస్ బెంజ్, రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ప్రభాస్ వద్ద ఉన్నాయని ఫిలింనగర్ టాక్. సినిమాకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ తన సంపాదనను పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని బట్టి ప్రభాస్ ఆస్తుల విలువ రూ. 300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయన జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











