కుట్రలతో యువ హీరో కెరీర్ నాశనం... 10 ఏళ్లుగా కార్ఖానా నడుపుకుంటూ...
చిత్ర పరిశ్రమ విచిత్రమైనది ఇక్కడ ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వెండితెరపై వెలిగిపోయి సూపర్‌స్టార్లు అనిపించుకున్న వాళ్లు ఏ దిక్కూ లేకుండా పోయారు. విలాసవంతమైన జీవితం గడిపి పేదరికంతో పోరాడిన వారెందరో. ఇక సినిమాల్లో అవకాశాలు రాక కూలీ పనులు చేసుకుంటున్న వారు కూడా మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా తొలి సినిమాతోనే హిట్ కొట్టి 3 ఏళ్లలో ఏకంగా 13 సినిమాలు చేసిన హీరో ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. తన సొంతూరిలో కార్ఖానా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..
ఇప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఉన్న మారుతి తొలి చిత్రం ఈరోజుల్లో మూవీలో హీరోగా నటించిన శ్రీ మంగం గుర్తున్నాడా. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకున్న శ్రీ.. తర్వాత రయ్ రయ్, అరవింద్ 2, లవ్ సైకిల్, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, రామారావు ఆన్ డ్యూటీ, గులాబీ, అను అనే నేను తదితర సినిమాలు తీశాడు. తక్కువ బడ్జెట్‌తో మంచి యూత్ ఫుల్ సినిమాలలో నటించిన శ్రీకి మంచి గుర్తింపుప కూడా వచ్చింది. అయితే సక్సెస్ వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమలో వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీకి అవకాశాలు దక్కలేదు. దాంతో తన సొంతూరు విజయవాడకు వచ్చేసిన ఆయన తన తండ్రికి చెందిన కార్ఖానా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ మంగం సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను మా ఇంటి దగ్గరి నుంచి మా నాన్నగారి దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. నా సొంత డబ్బు, నేను సంపాదించిన డబ్బుని దాచుకుని వాటినే సినిమాల్లో పెట్టుకున్నాను. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి దాదాపు 9 ఏళ్లు అయిపోతోంది. అక్కడ సంపాదించిన ఒక్క రూపాయి కూడా ఏం లేదు. మొత్తం అంతా అక్కడే పోయింది. పెద్ద నటులను చూసి మనం స్పూర్తి పొందుతాం. దాంతో మన సినిమా ఎక్కడైనా ఆగిపోతే, మనం పూనుకుని సినిమా రిలీజ్ చేస్తాం. అలా నేను చేసిన సినిమా ఒక్కటి కూడా ఆగలేదు. కొందరు నన్ను తొక్కేసి ఉండొచ్చు.. కానీ నేను దానిని నమ్మను. ఫలానా వ్యక్తి వల్ల నా సినిమా రిలీజ్ కాలేదు అవన్నీ నాకు తెలుసు. కానీ నా సినిమాలలో ఆరోజు కంటెంట్ ఉండుంటే గ్యారెంటీగా ఆ సినిమా ఆడేది. నన్ను తొక్కేసినవాళ్ల పేర్లు బయటపెట్టి.. నేను మళ్లీ సినిమాలలో అవకాశాల కోసం బయటపెట్టినట్లుగా ఉంటుంది. ఏదో ఒకరోజు మళ్లీ నేను ఫాంలోకి వచ్చాక, నేనే వాళ్లతో ఫేస్ టూ ఫేస్ మాట్లాడతానని శ్రీ అన్నారు.
సినిమా ఇండస్ట్రీ ఫాంలో ఉన్నవాడి మాటలే నమ్ముతుంది. సక్సెస్ లేకపోతే మనల్ని కుక్క కంటే హీనంగా చూస్తారు. రీసెంట్‌గా ఓ పెద్ద డైరెక్టర్ నైట్ 10.30కి కాల్ చేసి రేపొద్దున్న 6 గంటలకి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ఉందని చెప్పాడు. దాంతో రాత్రికి రాత్రి ఇంటికి కూడా వెళ్లకుండా విజయవాడ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిపోయా. నేనే వెళ్లేసరికి అర్ధరాత్రి కావడంతో అక్కడే రూమ్ తీసుకుని అక్కడే ఉండిపోయా.. పొద్దునే 6 గంటలకి లోకేషన్‌కి వెళ్తే ఆ డైరెక్టర్ నన్ను చూస్తూనే ఉన్నాడు.. కానీ షాట్‌కి పిలవడం లేదు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఓపికగా ఎదురుచూసి ఇక నేనే వెళ్లి అడిగా. దాంతో రేపొద్దున్న ఆఫీసులో కనిపించు, అప్పుడు మాట్లాడతానని అన్నారు. ఆయన నన్ను, నా ఓపికని టెస్ట్ చేయడానికి ఇదంతా చేశాడేమో. ఇలాంటి నా జీవితంలో చాలా జరిగాయి అని శ్రీ వ్యాఖ్యానించారు.
ఒక డైరెక్టర్ తన సినిమా ప్రారంభమయ్యేటప్పుడు నాతో సినిమా చేస్తానని చెబుతుండేవాడు. దాంతో హీరో, హీరోయిన్లకు ఫాదర్ అయినాసరే నేను చేస్తానని చెప్పాను. ఓ రోజున నువ్వు ఎలా ఉన్నావో అర్జెంట్‌గా ఫోటో పెట్టు నీతో ఫోటోషూట్ చేయాలని చెప్పాడు. ఆ మాట చెప్పి దాదాపు 4 నెలలు అయిపోయింది.. వాళ్లది ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు. నన్ను విలన్‌గా లాంచ్ చేయాలని అతను అనుకుంటున్నాడు. అలాంటి కాన్ఫిడెంట్ ఇస్తే నేను కూడా బాడీ మీద ఫోకస్ పెడతాను అని శ్రీ చెప్పారు.
రోజుకు మూడు షిఫ్ట్‌లు పనిచేసి 4 నెలలు అస్సలు నిద్రపోలేదు. 3 ఏళ్ల గ్యాప్‌లో 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఫ్లాపులు ఎక్కువ ఉన్నాయి.. అందుకే మనకి ఐడెంటీఫికేషన్ లేదు. నాన్న ఇచ్చిన వ్యాపారం చేసుకుంటూ నడిపిస్తున్నా.. మొన్న వచ్చిన వరదల్లో నా మిషనరీ అంతా మునిగిపోయింది. ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందిగానే ఉంది.. కొత్త మిషనరీతో మళ్లీ బిజినెస్ ముందుకు తీసుకెళ్తా. కోటి రూపాయలు వచ్చినా, జేబులో చిల్లిగవ్వ లేకపోయినా ఒకేలా ఉంటాను. జేబులో చిల్లిగవ్వ లేకుండా హైదరాబాద్‌లో బతికిన రోజులు ఉన్నాయి. పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ డైరెక్టర్ గచ్చిబౌలి హోటల్‌లో, గలాటా మూవీ డైరెక్టర్ ఆవాస హోటల్‌లో ఉన్నాడు. వీళ్లిద్దరూ నన్ను హోటల్‌కి పిలిచారు. అప్పటికే 6 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. కారు కూడా అమ్మేశా. ఆ హోటల్స్‌కి వెళ్లడానికి కారు లేదు. టీ తాగడానికి కూడా ఒక్కరూపాయి లేదు. కూర్చొని నా కెరీర్ ఏంటీ ఇలా అయిపోయింది? నేను ఇలా చేసేసుకున్నాను? అని ఆలోచిస్తున్నా అని శ్రీ తెలిపారు.
గలాటా డైరెక్టర్ ఫోన్ చేసి అడ్వాన్స్ తీసుకెళ్లమన్నాడు. నేను గ్రీన్ బావర్చి నుంచి ఆవాసా హోటల్‌కి వెళ్లాలి. అక్కడికి వెళితే ముందు నా చేతిలో డబ్బులు పడతాయని నడక ప్రారంభించా. జూబ్లీ చెక్‌పోస్ట్‌కి వెళ్లేసరికి కాళ్లు నొప్పులు వచ్చేశాయి. దాంతో సర్వీస్ ఆటో ఎక్కేశా.. దిగిన తర్వాత ఆటోవాడి దగ్గర ఏదో ఒకటి చెప్పుకుందామని నిర్ణయించుకున్నా. ఆవాసా దగ్గర దిగి జేబులో డబ్బులు లేవని ఆటోవాడితో చెబుతుండగా నా పక్కనే ఉన్న అమ్మాయి నన్ను గుర్తుపట్టి డబ్బులు ఆ అమ్మాయి ఇచ్చేసింది. నేను ఏ తప్పు చేయకపోయినా ఆర్ధికంగా నష్టపోయా. కొంతమంది దర్శకులు, నిర్మాతలు నన్ను తప్పుదోవ పట్టించి, నన్ను వాడుకున్నారు అని శ్రీ మంగం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











