చిల్లిగవ్వ ఇవ్వలేదు.. ఆ నిర్మాతల చేతుల్లో మోసపోయా , స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
సినీ రంగం సక్సెస్ వెంటే పరుగులు తీస్తుందన్నది బహిరంగ రహస్యం. పూలు పడిన చోటే రాళ్లు పడతాయి.. జేజేలు అందుకున్న చోటే అవమానాలు ఛీత్కారాలు ఎదురవుతాయి. ఫ్లాప్స్ ఇచ్చే దర్శకులు, హీరోలు, హీరోయిన్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. బ్లాక్ అండ్ వైట్స్ రోజు నుంచి నేటి కాలం వరకు పరిశ్రమది ఇదే సూత్రం. ఎందుకంటే సినిమా అంటే పక్కా బిజినెస్‌గా మారిపోయింది కాబట్టి. వరుసగా ఫ్లాప్స్ వస్తుంటే సదరు నటీనటుల కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే.
ఇదిలాఉండగా.. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్‌కు పాపం ఈ మధ్య కాలం కలిసిరావడం లేదు. తను నటించిన సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. ఓ హీరో చేసే సినిమాలు వరుసగా ఫట్ అవుతుంటే అతని డేట్స్ తీసుకోవాలంటే దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తుంటారు. కానీ అక్షయ్ కుమార్ ఇన్ని ఫ్లాపులు ఇచ్చినా ఆయన కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా నడుస్తోంది.

2020 నుంచి 2024 వరకు కేవలం నాలుగేళ్లలోనే అక్షయ్ 14 సినిమాలు చేస్తే అందులో 12 ఫ్లాప్ కావడమే కాక నిర్మాతలకు రూ.వందల కోట్లలో నష్టాలను మిగిల్చాయి. అయినప్పటికీ నిర్మాతలు ఆయనతో సినిమాలు నిర్మించేందుకు క్యూకడుతున్నారు. ప్రస్తుతం అక్షయ్ హీరోగా నటిస్తున్న 10 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా అక్షయ్ నటించిన సర్ఫిరా అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి రెమ్యునరేషన్ కింద అక్షయ్ కుమార్ రూ.60 కోట్లు తీసుకోగా.. కలెక్షన్లు కనీసం రూ.3 కోట్లు కూడా రాకపోవడం బాలీవుడ్‌లో దుమారం రేపుతోంది.
ఏనాడు తన ఫ్లాప్స్‌పై స్పందించని అక్షయ్ కుమార్ తాజా ఎమోషనల్ అయ్యారు. ప్రతి సినిమా వెనుక ఎంతోమంది కష్టం ఉంటుందని, దాని కోసం ప్రాణం పెడతామని అలాంటి మూవీ ఫ్లాప్ అయినప్పుడు మన హృదయం ముక్కలవుతుందని అక్షయ్ కుమార్ ఆదేవన వ్యక్తం చేశారు. సినిమా రిజల్ట్ కొన్నిసార్లు మనల్ని బాధించవచ్చని.. కానీ ప్రతి దాని నుంచి నేర్చుకోవాలన్నారు. ప్రేక్షకుల అభిరుచి మారిందని.. దానికి తగ్గట్లుగా మనం కూడా మారాల్సి ఉందని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్లుగా ఫిట్‌గా ఉండటం వల్లనే తాను స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నానని ఆయన వెల్లడించారు.

ఇదే సమయంలో కెరీర్‌లకు తనకు ఎదురైన మోసాల గురించి కూడా ఈ స్టార్ హీరో తెలియజేశారు. తనను పలువురు నిర్మాతలు మోసం చేశారని, రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొటారని.. తనను మోసం చేశారనే విషయం తెలిసిన తర్వాత వారికి దూరంగా ఉండటం మొదలుపెట్టానని అక్షయ్ చెప్పారు. తన దృష్టిలో ఆడిన మాట తప్పడం కూడా మోసం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అక్షయ్ కుమార్‌ని మోసం చేసిన ఆ నిర్మాతలు ఎవరా అంటూ బీటౌన్‌లో పెద్ద చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











