HBD Balakrishna బాక్సాఫీస్ బంగారుకొండ బాలకృష్ణ.. 400 రోజులు ఆడిన నటసింహా మూవీ గురించి తెలుసా?
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. 1974లో తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ''తాతమ్మ కల '' సినిమాతో పరిచయమయ్యారు బాలయ్య. తండ్రిలాగే పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఈ తరంలో పౌరాణిక చిత్రాల్లో నటించిన అరుదైన హీరో బాలయ్య. వందకు పైగా చిత్రాల్లో నటించి నటసింహంగా మన్ననలు అందుకుంటున్నారు. ఐదు దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు తన సేవలు అందిస్తున్న బాలయ్య జన్మదినం నేడు. ఈ సందర్భంగా నందమూరి అందగాడి సినీ జర్నీపై ప్రత్యేక కథనం.
1960 జూన్ 10న చెన్నైలో ఎన్టీఆర్ - బసవతారకం దంపతులకు బాలకృష్ణ జన్మించారు. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన బాలయ్య.. ఆయన అడుగుజాడల్లోనే సినీరంగ ప్రవేశం చేశారు. కొంతకాలం పాటు తండ్రి చాటు బిడ్డగానే సినిమాలు చేసిన బాలకృష్ణ.. మంగమ్మగారి మనవడుతో స్టార్ డమ్ అందుకున్నారు. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా దూసుకెళ్లారు బాలయ్య. సీతారామ కళ్యాణం, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, బొబ్బిలి సింహం, రౌడీ ఇన్స్‌పెక్టర్, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో తన సత్తా ఏంటో చూపించారు. ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్సన్‌తో పాటు సాంఘిక చిత్రాలు, ప్రేమ కథాలు చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో భైరవద్వీపం వంటి జానపదం, శ్రీకృష్ణార్జున విజయంతో పౌరాణికం చేశారు.

ఈ స్మార్ట్ యుగంలోనూ శ్రీరామరాజ్యం, పాండురంగడు వంటి చిత్రాలు చేసి ఈ తరాన్ని మెప్పించారు బాలకృష్ణ. ఐదు దశాబ్ధాల కెరీర్‌లో ఎన్నో రికార్డులను, ఇండస్ట్రీ హిట్‌లను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు . యువ హీరోల సినిమాలే వంద రోజులు ఆడలేని సమయంలో లెజెండ్ సినిమా ఓ థియేటర్‌లో 400కు పైగా రోజులాడి రికార్డ్ సృష్టించింది. అలాగే ఒకే ఏడాదిలో ఆరు బాక్సాఫీస్ హిట్లు కొట్టిన రికార్డు కూడా బాలయ్యేది . 1986లో ఆయన నటించిన ముద్దుల క్రిష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు విడుదలై బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలకు మించి పనిచేస్తున్నారు . ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై అన్‌స్టాపబుల్ అంటూ అడుగుపెట్టి దానికి తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చారు. సెలబ్రిటీలతో బాలయ్య చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం అన్‌స్టాపబుల్ షో కారణంగానే ఆహా రేటింగ్స్, సబ్‌స్క్రైబర్లు పెరిగారంటే అతిశయోక్తి కాదు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా వేలాది మందికి నాణ్యమైన వైద్యం అందేలా చేస్తున్నారు. క్యాన్సర్ పరిశోధన, చికిత్సలలో ఈ సంస్థ దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తోందంటే అందుకు బాలకృష్ణ కృషి ఎంతో ఉంది. ఇక తండ్రి అడుగు జాడల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించి తన కుటుంబానికి కంచుకోట వంటి హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకున్నారు.
విజయాలే కాదు.. బాలయ్య ఎన్నో ఫెయిల్యూర్స్‌ను సైతం చూశారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత మరో విజయం సాధించడానికి ఆయన ఎంతో నిరీక్షించారు. విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్కమగాడు, పాండురంగడు, మిత్రుడు వంటి సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక బాలయ్య పని అయిపోయింది అనుకున్న సమయంలో , తనను తాను నిరూపించుకోవాల్సిన దశలో ఆయన సింహ గర్జన చేశారు. బోయపాటి శీను దర్శకత్వంలో 2010లో వచ్చిన సింహాతో బ్లాక్‌బస్టర్ కొట్టారు . బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయినా తట్టుకుని నిలబడగలిగారు.

ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే బాలయ్యను కొందరు విమర్శించినా .. కెమెరా ముందు ఒకలా, మరోలా ముందు ఉండటం తన వల్ల కాదంటారు. మంచైనా, చెడైనా ఫేస్ టూ ఫేస్ . ఈ విషయంలో ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా, ట్రోలింగ్ నడిచినా భయం తన బయోడేటాలో లేదని చెబుతారు. విజయాలు పలకరించినా, పరాజయాలు వెక్కిరించినా తొణకని, బెణకని వ్యక్తిత్వంతో దూసుకెళ్తున్న నందమూరి నటసింహం మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. హ్యపీ బర్త్ డే టూ బాలయ్య.


Click it and Unblock the Notifications











