కూలీ తర్వాత రజనీకాంత్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? ఒక్కో మూవీకి రెమ్యునరేషన్ ఎంతంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్.. పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 5 దశాబ్ధాలకు పైగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అభిమానులతో తలైవా అనిపించుకున్నారు. సగటు హీరోల మాదిరిగా అందంగా లేకపోయినా, సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా తన ప్రతిభ, డిఫరెంట్ మేనరిజం, స్టైల్‌తో కల్ట్ ఫ్యాన్ బేస్‌ని సంపాదించారు రజనీ. భారతదేశంతో పాటు జపాన్, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లోనూ రజనీకి ఫాలోయింగ్ ఉంది. 70 ప్లస్‌లోనూ కుర్రాళ్లతో పోటీపడుతూ వరుసగా సినిమాలు తీస్తూ వెళ్తున్నారు రజనీ. డిసెంబర్ 12న తలైవా పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన కెరీర్, రికార్డులు, ఆస్తులు, రెమ్యునరేషన్ విషయాలు పరిశీలిస్తే..
డిసెంబర్ 12, 1950న బెంగళూరులో స్థిరపడిన మరాఠీ కుటుంబంలో జన్మించారు రజనీకాంత్. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. వీరి పూర్వీకులు మహారాష్ట్రలోని పూణే నుంచి కర్ణాటక ప్రాంతానికి వలస వచ్చారు. రజనీ తండ్రి రామోజీరావు పోలీస్ కానిస్టేబుల్, తల్లి సాధారణ గృహిణి. నలుగురు తోబుట్టువులలో రజనీ చిన్నవాడు. ఆయనకు అన్నయ్యలు సత్యనారాయణ రావు, నాగేశ్వరరావు, అక్కడ అశ్వత్ బాలుభాయ్ ఉన్నారు. చిన్నప్పుడు రామకృష్ణ మఠంలో చదువుకోవడం వల్ల భారతీయ సనాతన ధర్మం, వేదాలు, ఆధ్యాత్మికతపై రజనీకి మక్కువ ఏర్పడింది.

కండక్టర్‌గా ఉద్యోగం
ప్రీ యూనివర్సిటీ కోర్స్ చదివిన రజనీకాంత్ తన కుటుంబ పోషణ నిమిత్తం కూలీగా పనిచేశారు. ఈ దశలో బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో ఆయనకు కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో తన స్టైల్, మేనరిజంతో ప్రయాణికులను ఆకట్టుకునేవారు రజనీ. అలాగే చిన్నాచితకా నాటకాలు వేస్తూ తనలోని నటుడిని అందిరికీ పరిచయం చేశారు. ఈ క్రమంలో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన రజనీకాంత్.. దిగ్గజ దర్శకుడు కే బాలచందర్ కళ్లలో పడ్డారు. 1975లో తను తెరకెక్కించిన అపూర్వ రాగంగల్ సినిమాలో అవకాశం ఇవ్వడంతో పాటు శివాజీ గైక్వాడ్‌గా ఉన్న తన పేరును రజనీకాంత్‌గా మార్చింది కూడా బాలచందరే.
విలన్ నుంచి సూపర్‌స్టార్‌గా
తొలుత నెగిటివ్ పాత్రలతో ఆకట్టుకున్న రజనీకాంత్ ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్‌ల శకం ముగిసిన తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా దూసుకొచ్చారు రజనీ. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన చిత్రాలు రిలీజ్ కావడంతో ఇక్కడా రజనీకి ఫ్యాన్ బేస్ పెరిగింది. దాదాపు 5 దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో 170కి పైగా సినిమాలలో రజనీకాంత్ నటించారు.
కళ్లు చెదిరే రెమ్యునరేషన్
రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన అభిమానులకు పండగే. ఈ క్రేజ్ నేపథ్యంలోనే పలు సందర్భాలలో ప్రత్యేకంగా సెలవులు ప్రకటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 2007లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీకి సినిమాకు 26 కోట్ల రూపాయల పారితోషికం అందుకుని ఆసియాలో జాకీచాన్ తర్వాత భారీ పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు తలైవా. 2010లో మరోసారి శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన రోబో.. ఆ సమయంలో భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా నిలిచింది. మరోసారి వీరిద్దరి కలయికలో వచ్చిన రోబో 2 (2018) ఆ ఏడాదిలో భారీ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. మధ్యలో పేట, దర్బార్, అన్నాత్తే తదితర చిత్రాలతో నిరాశ పరిచినా జైలర్, కూలీ చిత్రాలతో తనలో ఏమాత్రం వాడి తగ్గలేదని నిరూపించారు రజనీకాంత్. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలోనే జైలర్ 2లో నటిస్తోన్న ఆయన .. తన ప్రాణమిత్రుడు కమల్ హాసన్ ప్రొడక్షన్స్‌లో తన 173వ సినిమాలో నటిస్తున్నారు.
రజనీ ఫేవరెట్ కార్లు ఇవే
సినిమాకు 150 నుంచి 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే రజనీకాంత్ తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తారు. అయితే కొంతమేరకు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలలోనూ రజనీకి పెట్టుబడులు ఉన్నట్లుగా కోలీవుడ్ టాక్. ఆయనకు చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం పోయిస్ గార్డెన్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆయన గ్యారేజీలో రోల్స్ రాయిస్ ఫాంటమ్, బీఎండబ్ల్యూ ఎక్స్ 7, మెర్సిడేస్ బెంజ్ జీ వాగన్, లంబోర్గనీ కార్లు ఉన్నాయి.
బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌కు దూరం
చెన్నైలోని అత్యంత విశాలమైన రాఘవేంద్ర కళ్యాణ మంటపం ద్వారా రజనీకి భారీగా ఆదాయం వస్తోంది. అయితే ఎక్కువగా తను నటించే సినిమాలు, పారితోషికం ద్వారానే తలైవా సంపాదిస్తున్నారు. మిగిలిన నటుల మాదిరిగా ఆయన బ్రాండ్ అండార్స్‌మెంట్స్ జోలికి పోలేదు. రజనీ స్టార్‌డమ్ ప్రకారం ఆయన తలచుకుంటే రజనీ ఇంటి ముందు వందల కోట్లు పారితోషికం ఇచ్చేందుకు బడా కంపెనీలు క్యూకడతాయి. కానీ వాటికి తలైవా దూరం. తన 50 ఏళ్ల కెరీర్‌లో ఒకే ఒకసారి రజనీకాంత్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అది కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పామ్ కోలాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. రజనీకాంత్ ఆస్తుల విలువ దాదాపు 450 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని కోలీవుడ్ వర్గాల టాక్
నిరాడంబర జీవితమే
భారతదేశం గర్వించదగ్గ నటుడిగా, కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ రజనీకాంత్ ఇప్పటికీ నిరాడంబరంగానే జీవిస్తారు. పంచె, పైజుమా, టీషర్ట్స్‌లోనే ఎక్కడికైనా వస్తారు. తీరిక దొరికితే మిగిలిన హీరోల మాదిరిగా ఫారిన్ ట్రిప్స్ వేయకుండా హిమాలయాల్లో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి వెళ్లిపోతారు. తొలి నుంచి ఆధ్యాత్మికతను ఇష్టపడే రజనీకాంత్ .. తీర్ధయాత్రాలకు వెళ్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. రజనీకాంత్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీ బీట్.


Click it and Unblock the Notifications











