మా నాన్న రోబో.. చిరంజీవిని ద్వేషిస్తే అదే చేస్తాడు.. పవన్, అల్లు అర్జున్‌పై శిరీష్ క్రేజీ కామెంట్స్
కృషి, పట్టుదల, క్రమశిక్షణతో తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. కష్టాన్ని నమ్ముకుంటే ఎవరైనా, ఎంతటి సామాన్యుడైనా అసాధారణ విజయాలు సాధించొచ్చని నిరూపించారు చిరు. గాడ్ ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. దశాబ్థాలుగా టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారు చిరంజీవి. వివాదరహితుడిగా, అజాతశత్రువుగా చిరంజీవిని అభిమానులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు గౌరవిస్తారు. ఆయన వేసిన బాటలో నాగబాబు, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, సుస్మితలు ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. వీరిలో ఒకరు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్.
హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు సరైన హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు శిరీష్. మెగా బ్రాండ్ ఇమేజ్ కేవలం లాంచింగ్ వరకే ఉపయోగపడింది. కానీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని నిలదొక్కుకోవాల్సింది శిరీషే. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడుతున్నా రిజల్ట్ మాత్రం శూన్యం. ఊర్వశివో రాక్షసివోతో కాస్త పర్లేదని అనిపించుకున్నారు శిరీష్. రెండేళ్ల గ్యాప్ తర్వాత శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన బడ్డీలో నటించారు శిరీష్.

గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తుండగా.. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 2న బడ్డీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై నమ్మకంతో ఉన్నామని, ఇంటిల్లిపాది కలిసి చూసే చిత్రంగా నిలుస్తుందని.. నిర్మాతతో చర్చించి టికెట్ రేట్లు కూడా తగ్గించామన్నారు. టికెట్ ధరలు పెంచి ప్రేక్షకుల నుంచి డబ్బు సంపాదించేకన్నా.. ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించి, మరింత సంపాదించొచ్చన్నది తన సూత్రమని శిరీష్ వెల్లడించారు. మా ప్రయత్నం సక్సెస్ అయితే మరింత మంది ఇదే బాటలో నడుస్తారని ఆయన ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలోని ఒక్కొక్కరి నుంచి తాను ఏమేం నేర్చుకున్నానో శిరీష్ ఆసక్తికరంగా వివరించారు. అన్నయ్య అల్లు అర్జున్ తనకు ఇష్టమైన బడ్డీ అని చిన్నప్పటి నుంచి ఆయనతోనే అన్ని విషయాలు షేర్ చేసుకున్నానని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్‌లో ఉన్నంత మానసిక ధైర్యం ఎవరికీ లేదని శిరీష్ ప్రశంసించారు. మా నాన్న రోబోల మాదిరిగా అన్ని పనులు సమయానికి పూర్తి చేయాలని తాపత్రయపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మేనమామ చిరంజీవిని ఆకాశానికెత్తేశారు శిరీష్.
మెగాస్టార్‌కి పాజిటివిటీ ఎక్కువని.. ఆయన అందరితోనూ మర్యాదగా వ్యవహరిస్తారని.. పవన్ చెప్పినట్లు చిరంజీవిని ఎంత ద్వేషించినా ఆయన ప్రేమనే పంచుతారని శిరీష్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే అల్లు అర్జున్ కారణంగా మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య చీలిక వచ్చిందని ఫ్యాన్స్ బాధపడుతున్న వేళ.. శిరీష్ మాటలు వారికి కొంత ఉపశమనం కలిగించాయని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











