జూ.ఎన్టీఆర్‌కు ప్రమాదం.. హీరో టీమ్ సంచలన ప్రకటన, కట్టుతో ఉన్న ఫోటోలు రిలీజ్
ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తన సినిమాల జోరును పెంచారు. తనకు జనతా గ్యారేజ్ వంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో దేవరలో నటిస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి ఈ మూవీలో ఎన్టీఆర్‌తో ఆడిపాడుతున్నారు. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం . బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ -1 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సింగిల్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తన రోల్‌కు సంబంధించిన షూట్‌ను ఎన్టీఆర్ రీసెంట్‌గా పూర్తి చేసుకున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండటంతో త్వరగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను కంప్లీట్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఎన్టీఆర్ సైతం ఇందుకు సిద్ధమవుతున్నారు. అంతా సజావుగా సాగుతున్న దశలో జూనియర్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నది ఆ వార్త సారాంశం. దీంతో తారక్ అభిమానులు ఆయన క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్, ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్‌కు గాయమైన మాట వాస్తవమేకానీ.. అది రోడ్డు ప్రమాదం వల్ల కాదని క్లారిటీ ఇచ్చింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా తారక్ ఎడమ చేతి మణికట్టుకు గాయమైందని.. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.

ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని.. విశ్రాంతి అనంతరం తిరిగి సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. అలాగే కట్టుతో ఉన్న ఎన్టీఆర్ ఎడమ చేతి ఫోటోను కూడా షేర్ చేసింది. తారక్ ఆరోగ్యం, ప్రమాదంపై ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. దీంతో తమ అభిమాన నటుడి గురించి ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ గాయం నుంచి వేగంగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా.. ఎన్టీఆర్ గతంలో పెద్ద యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. 2009లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రచారం ముగించుకుని ఎన్టీఆర్ ఆయన మిత్రులు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. అయితే మోతె గ్రామంలో తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తారక్ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని టీడీపీ శ్రేణులు, నేతలు హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసి నాడు ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. అయితే ఆసుపత్రి బెడ్ పైనుంచే టీడీపీ కూటమికి ఓటు వేయాలని ఎన్టీఆర్ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











