చిరు, పవన్‌లను అలా చూసి కన్నీళ్లు ఆగలేదు .. హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. పదేళ్ల నిరీక్షణ ఫలించి జనసేనాని కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కూటమి విజయం కన్నా పవన్ అభిమానులకు అదే నిజమైన ఆనందాన్ని ఇచ్చింది. ఫలితాల విడుదల రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన వెంటనే రోడ్ల మీదకు వచ్చి బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఇక సోషల్ మీడియా అయితే పవన్ నామస్మరణతో మోతమోగిపోతోంది.
ఇక పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులైతే భావోద్వేగానికి సైతం గురయ్యారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పిఠాపురంలోని పవన్ నివాసం నుంచి వీక్షించారు ఆయన కుటుంబ సభ్యులు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు ఆయన సోదరి విజయదుర్గలు కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో పవన్ విజయాన్ని చూసి విజయదుర్గ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్నికల్లో ఘన విజయం సాధించి, కూటమిని విజయ తీరాలకు చేర్చిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటికి వచ్చారు. గేటు దగ్గర కారు దిగిన నాటి నుంచి పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ప్రతీ ఒక్కరు పవర్‌స్టార్‌ను చూసి పొంగిపోయారు. రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సురేఖ తదితరులు పవన్‌ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పవన్ సోదరిలు , సురేఖలు హారతితో స్వాగతం పలికి దిష్టి తీశారు. అనంతరం తన పెద్దన్న చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీ భావోద్వాగానికి గురైంది. నాగబాబు కంటతడి పెట్టుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో 'డియర్ కళ్యాణ్ బాబు హ్యాట్సాఫ్ '' అని రాసున్న కేక్‌ను కట్ చేశారు. తర్వాత పవన్ తల్లి, వదినల పాదాలకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ దృశ్యం చూసి మెగాభిమానుల గుండె పొంగిపోతోంది. తాజాగా సినీ హీరో నిఖిల్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. '' నా ఫేవరేట్ మెగాస్టార్, పవర్‌స్టార్‌ల బంధాన్ని చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. గ్రౌండ్ లెవల్‌లో చేసిన పోరాటం , 100 % స్ట్రైక్ రేటుతో ఆయన సాధించిన విజయం .. మా అందరికీ స్పూర్తి. తమ నిస్వార్ధ ప్రయత్నాల ద్వారా ఇది సాధ్యమయ్యేలా చేసిన జనసైనికులకు అభినందనలు '' అంటూ సిద్ధార్ధ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా .. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నిఖిల్ సైతం కూటమి తరపున ప్రచారం చేశారు. చీరాలలో తన బంధువు, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎంఎం కొండయ్య తరపున ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఆయన విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల్లో ప్రచారమే కాదు.. నిఖిల్ అక్కడి స్థానికుల మనసును కూడా దోచుకున్నారు. చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉండగా.. అది శిథిలావస్థకు చేరుకుంది. తాజాగా ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించాడు.. అంతేకాదు దాని నిర్వహణ బాధ్యతలు కూడా నిఖిల్ తీసుకున్నాడు. దీంతో స్ధానికులు ఆయనను సదరు ఆలయంలో పూలపై నడిపించుకుంటూ తీసుకొచ్చి అభిమానం చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











