నా పనైపోయింది అన్నాడు, అందుకే బలుపుతో చెబుతున్నా: సందీప్ కిషన్
సందీప్ కిషన్, అన్యా సింగ్ జంటగా థ్రిల్లర్, హారర్ కాన్సెప్టుతో రూపొందుతున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.
వెంకటాద్రి టాకీస్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సందీప్ కిషన్ తొలిసారి నిర్మాతగా మారాడు. ఈ మూవీ నిర్మాణంలో వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ సంస్థలు భాగస్వాముగా ఉన్నాయి. ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూరుస్తున్నాడు.

సందీప్ కిషన్ పనైపోయింది అన్నాడు
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ... ‘నన్ను నేను పెద్ద స్క్రీన్ మీద చూసుకుని రెండు సంవత్సరాలైంది. ఒక నటుడికి ఈ గ్యాప్ ఎంతో నరకం. నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు. కరెక్ట్ సినిమా ఎంచుకుని, వెయిట్ తగ్గి ముందుకు వెళదామనే ఆలోచనతో ఉన్నపుడు మా మేనేజర్ ఇండస్ట్రీలో ఒక నిర్మాతను కలిశారు. మాటల్లో నా ప్రస్తావన వచ్చినపుడు... ఇంకెక్కడి సందీప్, అయిపోయాడు కదా.. కొత్త హీరోలు వచ్చారు కదా వాళ్ల గురించి చెప్పు అన్నారు' అని గుర్తు చేసుకున్నారు.

ఆ హక్కు నాకు మాత్రమే ఉంది
ఆ మాట అన్నందుకు థాంక్యూ సర్. మీ మీద నాకు కోపం ఏమీ లేదు. మీరన్న ఒక్క మాట వల్ల ఇన్‌స్పైర్ అయి ఈ సినిమా తీశాను. ఎందుకంటే నా జీవితంలో నేను ఏం చేయాలి అనేది డిసైడ్ చేయడానికి ఎవరికీ హక్కులేదు. నాకు మాత్రమే హక్కు ఉంది. అవకాశాలు మనకు రావు.. మనమే తెప్పించుకోవాలి. ఇన్నాళ్లు నేను నమ్మినవి చేసుకుంటూ వచ్చాను. ఇపుడు కూడా అదే అనిపించింది. అందుకే నిర్మాతగా మారారు... అని సందీప్ కిషన్ వ్యాఖ్యానించారు.

సినిమాలు మానేసి వెళ్లిపోవాల్సి వస్తే
సినిమాలు మానేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తే ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాతో వెళ్లిపోవాలే తప్ప రెగ్యులర్‌గా వెళ్లిపోకూడదు. ఇన్నాళ్లు నేను పడిన కష్టానికి, కన్న కలలకు అది న్యాయం చేయదు అనే ఉద్దేశ్యంతో తీసిన సినిమా ఇది.... అని సందీప్ కిషన్ తెలిపారు.

నీకేమైనా పిచ్చా? అని తిట్టారు
ఈ రోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ జెమిని కిరణ్ గారు, అనిల్ సుంకరగారు వచ్చారు. నాకు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అంటే వారే. నేను సినిమా నిర్మించబోతున్నాను అనే మాట చెప్పగానే నీకేమైనా పిచ్చా అని తిట్టారు. నాకు ఈ రోజు వరకు కొండంత అండగా ఉన్నది కూడా వీరే అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.

బలుపుతో చెబుతున్నాను
నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీశాము. ఈ మాట నేను ఫస్ట్ టైమ్ చెబుతున్నాను, గర్వంగా, బలుపుతో చెబుతున్నాను. ఈ సినిమా నేను చేశాను అని ధైర్యంగా చెప్పుకోగలను. హిట్టు కొట్టాలనే కసితో తీసిన సినిమా. థియేటర్ వచ్చే ఆడియన్స్‌కు బెస్ట్ సినిమా ఇవ్వాలని తీశాం. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టాను. ఈ సినిమా బాగా ఆడితే రేపు కొత్త వారితో కూడా సినిమాలు చేస్తూనే ఉంటాను... అని సందీప్ కిషన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











